
Shivaratri Special: శివుడికి లయకారుడు అని పేరు. అయినప్పటికీ అతడు పరమ బోళుడు. భక్తజన రక్షకుడు, సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయన విశ్వనాథుడు, చంద్రశేఖరుడు, భక్తితో కొలిచే ఆ భక్తులతో పాటు క్రిమి కీటాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే శివయ్య దర్శనం సర్వపాపహరణం.. నేడు శివరాత్రి సందర్భంగా ఆ ముక్కంటి గురించి తెలుసుకోవడం శుభప్రదం.
ప్రతి నెలలోనూ తెలుగు క్యాలెండర్లలో, పంచాంగాల్లో, పండుగలు, పర్వదినాల్లో మాస శివరాత్రి అని ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం.. ఇంతకీ మాస శివరాత్రి అంటే ఏమిటి? మహాశివరాత్రి అంటే ఏమిటి? ఈ రెండింటికి గల వ్యత్యాసాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రతి మాసంలోనూ బహుళపక్షం వచ్చే చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. సంవత్సరంలో 12 మాస శివరాత్రులు వస్తాయి. వాటన్నింటిలోనూ తల మానికమైనది, మహిమాన్వితమైనది మహా శివరాత్రి. తిథి ద్వయం ఉన్నప్పుడు అమావాస్య కు ముందు రోజు రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజుని జరుపుకోవాలని నిర్ణయ సింధు చెబుతోంది. మహా అని ఎక్కడ పిలిచినా అన్నింటికంటే గొప్పదని అర్థం.. శివుడి పార్వతులకు సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. అందుకే శివరాత్రి నాడు అయ్యకు, అమ్మకు ఉత్సవం జరుగుతుంది. శివ అంటే మంగళకరమైనది అని, శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అని అర్థం.
క్షీరసాగర మథనంలో అమృతం కంటే ముందు హాలాహలం పుట్టిన విషయం తెలిసిందే. అది ముల్లోకాలను దహించి వేస్తుందన్న ప్రమాదం ఉండడంతో దేవదానవు లందరూ భీతావహులై తమను రక్షించాలని పరమేశ్వరుని వేడుకోవడంతో లోక రక్షణ అర్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించాడు. గరళ కంఠుడయ్యాడు. ఈ హాలాహలం ప్రభావానికి ఆయన కంఠం నీలంగా మారడంతో నీలకంఠుడయ్యాడు. లోకాలన్నీ ఆ లోక నాయకుడి మూలాన స్థిమితపడిన రోజు పర్వదినం కాక మరేమిటి? అయితే ప్రతి పండుగకు ఐతిహ్యం ఉన్నట్టే శివరాత్రికి కూడా పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పూర్వం బ్రహ్మ, విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదులట కాస్త వివాదంగా మారింది. యుద్ధానికి దారి తీసింది.. దీనివల్ల ముల్లోకాలు తల్ల డిల్లిపోయాయి. దీంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ విష్ణువులు లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది.. అయితే ఆ లింగం మొదలు, తుది తెలుసుకోవాలన్నది ఆసక్తిగా మారింది. దీంతో బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్ర భాగాన్ని, విష్ణువు శ్వేత వరాహరూపంలో లింగం ఆదిని కనుక్కునేందుకు బయలుదేరారు.. కానీ వారి ప్రయత్నం విఫలమైంది.. ఇంతలో ఒక కేతక పుష్పం జారి కిందికి రావటం చూసి బ్రహ్మ మొగలి పువ్వును ఆపి తనకు, విష్ణుకు మధ్య జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. లింగం అగ్ర భాగాన్ని చూసినట్టుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు బ్రహ్మ. దీనికి మొగలిపువ్వు కాదనలేకపోయింది.. తాను లింగం ఆది భాగాన్ని చూడలేకపోయానని విష్ణువు ఒప్పుకున్నాడు .. అయితే లింగం అగ్రభాగాన్ని నిన్ను చూసానని బ్రహ్మ అబద్ధం ఆడాడు.. సాక్ష్యం కావాలి అంటే మొగలిపువ్వును అడగమని చెప్పాడు. దీంతో నేను ఓడిపోయానని విష్ణువు ఒప్పుకున్నాడు.. అయితే బ్రహ్మదేవుడు అబద్ధం ఆడటంతో తట్టుకోలేకపోయిన ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.. మొగలిపువ్వు అబద్దమాడినందున నాటి నుంచి తనను అర్చించడానికి పనికి రాదని తేల్చేశాడు.. భక్తులు ఎవరూ ఆ పువ్వుతో తనను అభిషేకించరాదని తేల్చేశాడు. అంతేకాదు అబద్ధం ఆడిన బ్రహ్మకు భూ లోకంలో ఎవరూ పూజ చేయరాదని,ఆలయాలు కట్ట కూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణు తనతో పాటు భూలోకంలో పూజలు అందుకునే విధంగా ఆశీర్వదించాడు.. జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మకు, విష్ణువుకు కనిపించిన సమయాన్ని లింగోద్భవ కాలంగా పరిగణించాలని, మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్టమైనదిగా వర్ధిల్లుతుందని చెప్పాడు.. స తిధి నాడు తన మూర్తిని, లింగాన్ని పూజించేవారికి మోక్షం లభిస్తుంది అన్నాడు.. శివరాత్రి నాడు పార్వతి సమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు.