
ABN RK- Minister Srinivas Goud: కొన్ని నిజాలు అవి ఎప్పటికీ వెలుగులోకి రావు. వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే గొప్ప ప్రయత్నమే జరగాలి. లేదా అంజనం వేసి వెతకాలి. అప్పుడే ఏం జరిగిందో ప్రపంచానికి తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఏర్పరచుకున్న అభిప్రాయం సరైన దారిలో పయనిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే… ఆ మధ్య మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం జరిగింది.. ఇందుకు సంబంధించి బిజెపి సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి పై విమర్శలు వచ్చాయి.. ఆ తర్వాత కేసు ఎందుకో చప్పున చల్లారిపోయింది. ఇప్పుడు దానిని మళ్లీ తిరగతోడే ప్రయత్నం జరుగుతోంది. అదేంటి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు కదా… ఈ కేసును ఇప్పుడు ఎవరు తిరగతోడతారు అనే ప్రశ్న మీలో కలిగిందా? కానీ దీనిని తిరగతోడుతోంది ముఖ్యమంత్రి కాదు, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అంతకన్నా కాదు… ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ. ఈమధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తో మరమ్స్ బాగా లేవు కాబట్టి.. గోకే ప్రయత్నం చేస్తున్నాడు. తన చానల్లో ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి ఈసారి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానించాడు. పలు విషయాల మీద అతడిని ప్రశ్నలు అడిగాడు. ఇంటర్వ్యూ ప్రోమో చూస్తుంటే హాట్ హాట్ గా సాగినట్టు కనిపిస్తోంది. కొన్ని ప్రశ్నలకు శ్రీనివాస్ గౌడ్ నీళ్లు నమిలాడు. అదోలా మొహం పెట్టాడు.
శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం సంఘటనకు సంబంధించి కేసు చప్పున చల్లారిపోయేందుకు కారణం ఏమిటో తనకూ తెలియదని మంత్రి వ్యాఖ్యానించాడు. బహుశా తన ప్రత్యర్థులు దాడి చేసేందుకు కుట్ర పన్ని ఉంటారని అనుమాన వ్యక్తం చేశాడు. తాను ఒక మంత్రి అయ్యుండి, ప్రభుత్వం కూడా వారిదే అయి ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మంత్రి వివరించలేదు. అసైన్డ్ భూముల ఆక్రమణకు సంబంధించి కూడా మంత్రి నోరు విప్పలేదు. అంతేకాదు టీఎన్జీవో అధికారుల సంఘం మీద పెత్తనం చలాయిస్తానంటున్న శ్రీనివాస్ గౌడ్.. ఆంధ్రప్రదేశ్ ను ఒక ఐదేళ్లు మాకు ఇస్తే బంగారు ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఆర్కే ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. అప్పుడు ఉద్యమంలో తిట్టారు కదా, ఇప్పుడు పూర్తిగా సత్యనాష్ చేస్తారా అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మౌనాన్ని ఆశ్రయించారు.

ఇక భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసింది దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకే అని చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కెసిఆర్ కు మోదీ అంటే భయం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్కే ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ కు భయం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు… ఆయన భయపడుతూనే ఉంటాడు. మహా పిరికివాడు అని ఆర్కే బాంబు పేల్చారు. అంతేకాదు లిక్కర్ స్కాం ప్రస్తావనకు వచ్చినప్పుడు కచ్చితంగా కవితను అరెస్టు చేస్తారని ఆర్కే స్పష్టం చేయగా, అరెస్టు చేస్తారు అంతకుమించి చంపరు కదా అని శ్రీనివాస్ గౌడ్ ఉల్టా క్వశ్చన్ వేశాడు.. ఇక తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు పనిచేసిన వాళ్లంతా కూడా పత్తా లేకుండా పోయారు, మీరు మాత్రమే అంతకంతకు ఎదిగిపోతున్నారు అని ఆర్కే వ్యాఖ్యానించగా… తన బలం కెసిఆర్ అని శ్రీనివాస్ గౌడ్ వివరించారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు అనే ఆర్కే ప్రశ్నకు… శ్రీనివాస్ గౌడ్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంకా ఇలాంటివి ఎన్నో ప్రశ్నల పరంపర శ్రీనివాస్ గౌడ్ మీద కురిసింది. మరి వీటికి ఆయన ఏం సమాధానం చెప్తారో వచ్చే ఆదివారం దాకా తెలియదు. ఏ మాటకు ఆ మాటే తన ప్రశ్నలతో మాత్రం ఆర్కే శ్రీనివాస్ గౌడ్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు అనేది మాత్రం వాస్తవం.