Lalitha Jewellery Kiran Kumar Journey: ‘డబ్బులు ఎవరికి ఊరికే రావు’ ఈ పదం ఎప్పుడు టీవీ ఆన్ చేసినా వినిపిస్తూనే ఉంటుంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది వినిపిస్తుంది. వాస్తవానికి కష్టపడితేనే డబ్బులు వస్తుంది అనే విషయం చెప్పడానికి దీనిని వాడుతూ ఉంటారు. అయితే ఈ పదంతోనే ఓ వ్యక్తి పేదరికం నుంచి పదిమందికి ఉద్యోగం పంచేవరకు ఎదిగాడు. పట్టుదల, కృషి ఉంటే ఎంతటి విజయం అయినా సొంతమవుతుందని నిరూపించాడు. ఇప్పటికే ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఎవరో కాదు లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ పైకి చూస్తే ధనవంతుడిలా కనిపిస్తాడు. ఆయన స్టైల్ డిఫెరెంట్ గా ఉంటుంది. కానీ ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడన్న విషయం కొందరికే తెలుసు. కిరణ్ కుమార్ ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఏం చేశాడు? ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి?
కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా లో జన్మించారు. కిరణ్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో కుటుంబ పోషణం భారంగా మారింది. అయితే చేదోడు వాదోడుగా ఉండడానికి కిరణ్ కుమార్ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. ఈ పనుల కారణంగా అతని చదువుకు అడ్డంకి ఏర్పడింది. అందుకే 5వ తరగతిలో ఉండగానే కిరణ్ చదువు మానేశాడు. ఆ తర్వాత కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలి అని 12 ఏళ్ల వయసులోనే.. రూ.30కి ఓ జువెలర్స్ షాప్ లో పనిచేసేవాడు. అయితే ఈ సమయంలో అతనికి కొత్త ఆలోచన వచ్చింది. నెల్లూరులో బంగారం తయారైతే.. హైదరాబాద్, చెన్నైలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దీంతో కిరణ్ కుమార్ తన తల్లికి చెందిన బంగారు గాజులను అడిగాడు. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా కొడుకుకు ఆ గాజులను ఇచ్చింది. ఆ గాజులను ఐదు ముక్కలుగా తయారుచేసి వాటిని జుంకీలుగా మార్చుకుంటాడు. ఇలా మార్చిన దానిని జువెల్లర్ షాప్ కు అమ్మేవాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ బయట ఉన్నా పాత బంగారంను కొనుగోలు చేసి.. వాటిని ఆభరణాలుగా తయారు చేసి జువెలర్స్ కు అమ్మేవాడు. అలా లలిత జువెలర్స్ తో డీల్ మాట్లాడుకుని ఎప్పటికీ అలా చేసేవాడు.
అయితే 1999లో లలిత జ్యువెలర్స్ ఓనర్ ఎంఎస్ కంద స్వామి చాలా అప్పుల్లో ఇరుక్కుపోయాడు. అంతేకాకుండా అతని జువెలర్స్ను అమ్మాలని అనుకుంటాడు. కానీ మార్కెట్లో కొనడానికి ఎవరూ ముందుకు రారు. అయితే కిరణ్ కుమార్ మాత్రం ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తాడు. లలిత జ్యువెలర్స్ ను కొనుగోలు చేసి ఆ పేరులో అదనంగా A యాడ్ చేశాడు. ఆ తర్వాత నాణ్యమైన బంగారాన్ని తయారు చేస్తూ జనాల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడు. లలిత జ్యువెలరీ అంటే నాణ్యమైన బంగారం దొరుకుతుంది అని స్టేజికి తీసుకువచ్చాడు.
ఇదే సమయంలో తన కంపెనీకి తానే అడ్వర్టైజ్మెంట్ గా మారి ‘డబ్బులు ఎవరికి ఊరికే రావు’ అనే పదంతో జనాలను ఆకట్టుకున్నాడు. దీంతో లలిత జ్యువెలర్స్ ను ప్రఖ్యాత కంపెనీగా మార్చుకున్నాడు కిరణ్ కుమార్. 1985లో టేక్ ఓవర్ చేసిన కిరణ్ కుమార్ ఇప్పుడు వాటిని భారతదేశంలో 56 సంస్థలను ఏర్పాటు చేశాడు. హైదరాబాదులో లక్ష 30 వేల చదరపు అడుగుల అతి పెద్ద షోరూంను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆయన సంపాదన రూ. 17వేల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేయబడింది.