
Shubman Gill -KL Rahul : ఎన్నాళ్లో వేచి ఉదయం ఇప్పుడు శుభ్ మన్ గిల్ కు వచ్చేసింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీమిండియా ఎవరూ లేనంత భీకర ఫామ్ లో గిల్ ఉన్నాడు. కానీ ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు పరుగులు చేయడానికి తండ్లాడుతున్న కేఎల్ రాహుల్ ను ‘వైస్ కెప్టెన్’ అంటూ జట్టులో కొనసాగిస్తున్నారు. కానీ అభిమానులు, విశ్లేషకులు ఊరుకోరు కదా.. అందుకే గోల చేశారు. ఎట్టకేలకు గిల్ పొలంలో మొలకలు వచ్చాయి. కేఎల్ రాహుల్ ను తొలగించి గిల్ ను మూడో టెస్టులో తీసుకున్నారు.
వన్డేల్లో డబుల్ సెంచరీ.. టి20 లో సెంచరీ… ఇంతటి సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు సంపాదించడం గిల్ కు అందని ద్రాక్షే అయింది. నాగపూర్ లో, ఢిల్లీలో అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురయింది.. క్రమంలో అతడికి ఇండోర్ లో మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. రాహుల్ సరిగా ఆడలేకపోతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, ద్రావిడ్ గిల్ వైపు మొగ్గు చూపారు.
ఓపెనర్ గా కేఎల్ రాహుల్ బలమైన ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు. తరచూ విఫలమవుతున్నాడు. తన చివరి పది టెస్ట్ ఇన్నింగ్స్ లో కనీసం 25 స్కోర్ కూడా సాధించలేకపోవడం అతని వైఫల్యాన్ని చాటుతోంది.. గత రెండేళ్లుగా టెస్టుల్లో భారత జట్టుకు తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం నమోదు కాలేదు అంటే అతని ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలోనే రాహుల్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించిన భారత జట్టు మేనేజ్మెంట్.. తర్వాత ఇండోర్ టెస్ట్ లో అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా, ఆ స్థానంలో గిల్ ను భర్తీ చేసింది.
రాహుల్ కు ఎన్ని రోజులపాటు కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ అండగా ఉంటూ వచ్చారు. కానీ అతడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. స్వల్ప స్కోర్ లకే వెనుతిరుగుతూ ఉండడంతో మిగతా బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి పెరుగుతున్నది. అతడు గనుక రాణించి ఉంటే టీం మరింత భారీ స్కోర్ సాధించేది.. ఇక రాహుల్ ను ఇటీవల మాజీ కెప్టెన్ గంగూలీ వెనకేసుకొచ్చాడు. టీం లో చాలామంది బ్యాట్స్మెన్ విఫలమవుతున్నారు. కానీ అందరూ రాహుల్ మీదే వేలెత్తి చూపిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక చాలా రోజులుగా తిరిగి జట్టులోకి రావాలని ఆశపడుతున్న గిల్ కు అవకాశం తగ్గడంతో అతడు ఉబ్బి తబ్బిబవుతున్నాడు.. తుది జట్టులో స్థానం లభించిన నేపథ్యంలో ” గిల్ భయ్యా నీ పొలంలో మొలకలు వచ్చాయంటూ” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.