Team India Cricket: టీం ఇండియాకు మంచి రోజులు రాబోతున్నాయా.. బీసీసీఐ వేస్తున్న అడుగుల సంకేతం అదేనా.. ఇకపై ఆడేవాళ్లే జట్టులో ఉంటారా.. అంటే అవుననే అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. వచ్చే ఏడాది ఆరంభంలో టీమిండియా ఆడే తొలి వన్డే సిరీస్ శ్రీలంకతోనే. ఇటీవల రద్దయిన టీమిండియా సెలెక్షన్ కమిటీ చివరిసారిగా శ్రీలంక సిరీస్‌కు జట్టును ఎంపిక చేసింది. ఈ క్రమంలో జట్టులో పలు కీలక మార్పులు చేసింది. వన్డే జట్టులో కచ్చితంగా ఉంటారని అనుకున్న ముగ్గురు ఆటగాళ్లకు మొండి చెయ్యి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ఈ ఆటగాళ్ల వన్డే కెరీర్ ముగిసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శిఖర్ ధవన్…
నిన్న మొన్నటి వరకు వన్డే ఫార్మాట్‌లో టీమిండియా ఓపెనర్‌గా సెలెక్టర్ల మొదటి చాయిస్ ధవనే. రోహిత్, ధవన్ జోడీనే వన్డే వరల్డ్ కప్‌లో జట్టుకు ఓపెనింగ్ చేస్తుందని రాహుల్ ద్రావిడ్ కూడా గట్టి సంకేతాలు ఇచ్చాడు. రోహిత్ లేని ప్రతిసారి వన్డే జట్టుకు ధవనే నాయకత్వం వహించాడు. కానీ కొంత కాలంగా ధవన్ చాలా నెమ్మదైన ఆటతీరు కనబరుస్తున్నాడు. దానికి తోడు నిలకడగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశతో జరిగిన మూడో వన్డేలో తనకు వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. డబుల్ సెంచరీ బాదేశాడు. దీంతో అతనిపై ఫోకస్ పెట్టాలని సెలెక్టర్లు డిసైడ్ అయ్యారు. ఇక ధవన్‌కు మళ్లీ టీమిండియా నుంచి పిలుపు రావడం కష్టంగానే కనిపిస్తోంది.
రిషభ్ పంత్
టెస్టు క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రిషభ్ పంత్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఏమాత్రం సత్తా చాటలేకపోయాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కెరీర్‌లో తొలి వన్డే శతకం నమోదు చేశాడు. చివరగా తను ఆడిన ఒక్క వన్డే, టీ20 మ్యాచులో కూడా రాణించలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని కేవలం టెస్టులకే పరిమితం చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అందుకే వన్డే, టీ20ల్లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లు కనుక తమ అవకాశాలను ఉపయోగించుకుంటే ఇప్పుడప్పుడే పంత్‌ను వన్డే టీంలో చూడటం జరగదు. ఈ ఏడాది వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఉన్న నేపథ్యంలో పంత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడించే రిస్క్ చేయకూడదని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంజూ శాంసన్..
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం చాలా మందికి గట్టి షాక్ అని చెప్పాలి. ఎందుకంటే అతన్ని కేవలం వన్డేలకే పరిగణనలోకి తీసుకుంటున్నామని ఇంతకుముందు సెలెక్టర్లు చెప్పారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కూడా ఉన్న నేపథ్యంలో అతనికి మరిన్ని అవకాశాలు దొరుకుతాయని అనుకుంటే.. సడెన్‌గా హ్యాండిచ్చారు. కేవలం టీ20 జట్టుకు మాత్రమే అతన్ని పరిమితం చేశారు. ఇలా చూసుకుంటే సెలెక్టర్ల కుళ్లు రాజకీయాలకు సంజూ వన్డే కెరీర్ బలి అయిపోతున్నట్లే కనిపిస్తోంది. దానికి తోడు వన్డేల్లో కేఎల్. రాహుల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్‌గా చూస్తున్న సెలెక్టర్లు.. ఇషాన్ కిషన్‌ను సెలెక్ట్ చేసిన తర్వాత మరో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూకు అవకాశం ఇవ్వడం జరగదనే అనిపిస్తోంది. ప్రస్తుతం చెత్త ఫామ్‌లో ఉన్న రాహుల్ పూర్తిగా విఫలమైతే.. సంజూకు అవకాశం రావొచ్చు.