Friendship: స్నేహం అనే బంధం చాలా గొప్పది. కొన్ని స్నేహాలు అవసరాల వరకే ఉంటే మరికొన్ని స్నేహాలు మాత్రం ఊపిరి ఉన్నంత వరకు ఉంటాయి. ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా సరే వారితో కలిసే ఉంటారు. సుఖసంతోషాల్లో, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ నిత్యం వారితోనే నిలుస్తారు. ఈ రిలేషన్ రెండు వైపుల ఉంటేనే బాగుంటుంది. లేదంటే ఆ రిలేషన్ నిలవదు. మరి ధర్మం ముఖ్యమా స్నేహం ముఖ్యమా అనే సందర్భం వస్తే మీరు ఏం చేస్తారు? అనేది కూడా ముఖ్యమే.
కొన్ని సందర్భాల్లో స్నేహితులు తప్పు చేస్తుంటారు. కానీ ఆ సమయంలో కూడా వారిని రక్షించి ఇతరులకు నష్టం చేస్తుంటారు. నా స్నేహమే నాకు ముఖ్యం అంటారు. వారి మీద ఉన్న ప్రేమతో తప్పు ఒప్పులు కనిపించవు. కానీ ఇతరులకు నష్టం జరుగుతున్నప్పుడు ఆ నష్టానికి మీ స్నేహితుడే కారణం అయినప్పుడు మీరు దాన్ని సరిదిద్దాల్సిందే అంటారు పెద్దలు. ఇలాంటి స్నేహం వల్ల అందరికీ మేలు జరుగుతుంది.
స్నేహం చెడిపోతుందని, లేదంటే స్నేహితుడు ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడని, ఆయనకు కష్టం వస్తుందని మీరు ధర్మం తప్పకూడదు. దీని వల్ల ఇతరులను బాధ పెట్టకూడదు. కొన్ని సందర్బాల్లో మీ స్నేహితుడు పోలీసు కేసులో ఇరుక్కుంటే వారిని దాచి పెట్టి కాపాడాలి అనుకుంటారు. కానీ అతను తప్పు చేశాడు. కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇలాంటి వాటిలో మీరు వత్తాసు పలకకూడదు. ధర్మాన్ని కాపాడుతూనే మీ స్నేహాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. నిజంగానే ఇలాంటి సందర్బం వస్తే బెయిలు తెచ్చే ప్రయత్నం లేదా ఇతర సహాయం చేయాలి కానీ దాచి పెట్టి అధర్మానికి పాలు పడవద్దు.
స్నేహం ఎంత గొప్పది అయినా సరే మన స్నేహం వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, తల్లి తండ్రి ఎవరైనా మీ ధర్మాన్ని మీరు పాటించాలి. రిలేషన్ ఎంత ముఖ్యం అయినా సరే ధర్మాన్ని కాపాడాలి అంటారు పెద్దలు.