Team India Captain Change: టీమిండియా జట్టులో కీలక మార్పులు చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ చర్యలు చేపడుతోంది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘోర పరాభవంతో ఆటగాళ్లను మార్చేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో గతేడాది టీ20 ప్రపంచ కప్ సూపర్ 12 దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది సెమీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన పోరులో టీమిండియా ఘోర వైఫల్యం అందరిని కలవరపరిచింది. దీంతో టీమిండియా పరువు గంగలో కలిసింది. మనవారు కప్ గెలవకున్నా పరువు తీశారు. కనీసం ఇంగ్లండ్ ను నిలువరించే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆందోళనలకు కారణమైంది.

పొట్టి ఫార్మాట్ లో 2007 తరువాత కప్ ను సొంతం చేసుకోవాలని కల నెరవేరడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అపజయం మూటగట్టుకుని రావడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నా ద్వైపాక్షిక సిరీస్ ల్లో చేతులెత్తేయడం మామూలుగా మారింది. ఈ సంవత్సరం సూపర్ 12 దశలో జోరు కొనసాగించినా సెమీస్ లో ఇంగ్లండ్ ను అడ్డుకోలేకపోయింది. దీంతో టీమిండియాలో లోపాలు బయటపడ్డాయి.
టీమిండియాలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, దినేష్ కార్తీక్ వంటి వారు జట్టుకు భారంగా మారుతున్నారు. దీంతోనే టీమిండియా విజయాలు సాధించలేకపోతోందనే అపవాదు మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియాలో మార్పులు శరణ్యమనే వాదనలు పెరుగుతున్నాయి. అభిమానుల నుంచి ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి. దీంతోనే టీమిండియాలో మార్పులు అనివార్యమని చెబుతున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే సూచనలు వస్తున్నాయి.

రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ దీనికి గాను కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే మూడు వన్డీలు, మూడు టీ 20 మ్యాచులకు ముందే హార్థిక్ ను కెప్టెన్ గా చేయాలని చూస్తున్నారని సమాచారం. మరోవైపు కెప్టెన్సీ మార్పుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ లో ఓటమి పాలైనంత మాత్రాన కెప్టెన్ ను మార్చడం సరైంది కాదని హితవు చెబుతున్నాడు.
టీమిండియా టీంను నడపడం అంత సులువు కాదని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో సక్సెస్ అయినంత మాత్రాన కెప్టెన్సీ అప్పగిస్తే విజయాలు సాధిస్తాడనే నమ్మకం ఉండదు. రోహిత్ శర్మ మంచి ఆటగాడే. కానీ విధి సహకరించక ఓటమి చెందారని గుర్తు చేస్తున్నాడు. దీంతో బీసీసీఐ ఏ మేరకు స్పందిస్తుందో తెలియడం లేదు.