India vs New Zealand 2nd ODI: న్యూజిలాండ్ పై మొదటి వన్డే గెలిచిన భారత జట్టు నేడు జరగబోయే రెండో మ్యాచ్ కు సిద్ధమైంది.. ఈ మ్యాచ్ కూడా గెలిచి వరుసగా ఈ ఏడాదిలో రెండవ సిరీస్ పట్టేయాలని చూస్తోంది.. ఇది త్వరలో జరగబోయే వరల్డ్ కప్ నకు సన్నాహకంగా ఉంటుందని భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సీరిస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్లో భారీ స్కోరు సాధించిన భారత్… ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఇబ్బంది పడింది. చివరి ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బ్రేస్ వెల్ వికెట్ తీయకపోయి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.

బ్యాటింగ్ ఓకే
భారత బ్యాటింగ్ మునుపటి కంటే చాలా మెరుగుపడింది.. కెప్టెన్ రోహిత్ శర్మ తన పాత లయ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ ఉప్పల్ మ్యాచ్లో అలరించకపోయినా ఈ ఏడాదిలో ఇప్పటికే అతడు రెండు సెంచరీలు పూర్తి చేశాడు.. ఇక శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ చేసి తాను ఓపెనర్ గా పనికి వస్తానని సంకేతాలు పంపాడు.. సూర్య కుమార్ యాదవ్ పర్వాలేకున్నా వన్డే మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.. హార్దిక్ పాండ్యా, శేయాస్ అయ్యర్ కుదురుకోలేకపోతున్నారు.. ఉప్పల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా భారీ స్కోరు సాధించలేక తొందరలోనే వెనుతిరిగాడు.. వీరిద్దరూ బ్యాటింగ్ బాగా మెరుగుపరచుకోవాలి.. ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాట్స్ మెన్లు ఆడుతున్నారు కాబట్టి సరిపోతోంది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉంటుంది.. ఇక బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ ఉప్పల్ మ్యాచ్లో తేలిపోయాడు.. ఆడిన అన్ని మ్యాచ్ల్లో పరుగులు తీయాలని లేకున్నా… ఒక ఆటగాడిగా తన వంతు బాధ్యత కచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఒకవేళ ఇషాన్ కిషన్ మొన్న జరిగిన మ్యాచ్లో కుదురుకొని గనుక ఉంటే భారత్ మరిన్ని ఎక్కువ పరుగులు చేసి ఉండేది.. కానీ అతడు త్వరగానే అవుట్ కావడంతో శుభ్ మన్ గిల్ చివరి వరకు క్రీజ్ లో ఉండాల్సి వచ్చింది.
చివర్లో చేతులెత్తేస్తున్నారు
భారత బౌలర్లు ప్రారంభంలో నిప్పులు చెరిగేలా బంతులు వేస్తున్నారు.. ఇది శుభసూచకమే అయినప్పటికీ… దీనిని చివరి వరకు కొనసాగించలేకపోతున్నారు. దీనివల్ల మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ ఏర్పడుతోంది. ఒకానొక దశలో మ్యాచ్ భారత్ నుంచి చేజారి పోతుందా అనే సందేహం కూడా కలుగుతున్నది. ఉప్పల్ మ్యాచ్ తీసుకుంటే మొదటి 6 వికెట్ల వరకు సత్తా చాటిన భారత బౌలర్లు.. తర్వాత చేతులెత్తేశారు. దీనివల్ల బ్రేస్ వెల్ లాంటి ఆటగాడు అసాధారణ బ్యాటింగ్ తో భారత శిబిరంలో ఆందోళన కలిగించాడు.. అందుకే బౌలర్లు మొదటి నుంచి చివరిదాకా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే న్యూజిలాండ్ మీద సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఉప్పల్ మ్యాచ్లో బ్రేస్ వెల్, శాంట్న ర్ ఆడిన తీరు అసమానం.. ఈ జోడిని విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా ప్రయాసపడ్డారు.
సిరాజ్ తప్ప..
ఇక భారత బౌలింగ్ దళంలో సిరాజ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. కానీ అతడికి సరైన అండ లభించడం లేదు.. శార్దుల్ ఠాకూర్ మెరుగ్గా బౌలింగ్ చేస్తాడు అనుకున్నప్పటికీ.. అతడు ఉప్పల్ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేదు.. ఒకవేళ మధ్య ఓవర్లలో అదనపు ఫేస్ తో వికెట్లు తీసే స్పెషలిస్ట్ పేసర్ అవసరం అనుకుంటే ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి రావచ్చు..స్పిన్ లో కులదీప్ యాదవ్ పర్వాలేదు అనిపించినా… వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోతున్నాడు.

న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయొద్దు
350 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో ఆరు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్… దారుణమైన ఓటమి పాలు కావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.. కానీ ఎక్కడా లేని పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. ఆ జట్టు ఆటగాళ్ళు బ్రేస్ వెల్, శాంట్నర్ అద్వితీయ బ్యాటింగ్ తో కివీస్ లో ఎక్కడా లేని ఆత్మ విశ్వాసాన్ని నింపారు.. ఓటమి నుంచి గెలుస్తామనే పరిస్థితి దాకా తీసుకొచ్చారు.. ఇక ఇదే ప్రేరణతో కివీస్ నేడు జరిగే మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది..ఇక మొదటి మ్యాచ్లో ఫిన్ ఆలెన్ భారీ షాట్లు ఆడినప్పటికీ పెద్ద స్కోరు చేయలేకపోయాడు. కాన్వే, లాథమ్, ఫిలిప్స్ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత్ కు కష్టాలు తప్పవు. ఇదే సమయంలో న్యూజిలాండ్ బౌలింగ్ పూర్తిగా గతి తప్పుతోంది.. ముఖ్యంగా మొదటి మ్యాచ్ లో గిల్ జోరుకు పేస్ త్రయం షిప్లే, ఫెర్గు సన్, టిక్నెర్ ల బౌలింగ్ పూర్తిగా గతి తప్పింది.. తాజాగా శనివారం మ్యాచ్లో మరింత నిలకడగా బంతులు వేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలనుకుంటున్నారు.
జట్ల అంచనా ఇది
భారత్
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సుందర్, శార్దూల్, ఉమ్రాన్, కులదీప్ యాదవ్, షమి, సిరాజ్.
న్యూజిలాండ్
ఆలెన్,కాన్వే, నికోల్స్, మిచెల్, లాథమ్( కెప్టెన్), ఫిలిప్స్, బ్రేస్ వెల్, శాంట్నర్, షిప్లే, ఫెర్గూసన్, టిక్నెర్.
పిచ్: 60 వేల సామర్థ్యం ఉన్న రాయ్ పుర్ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. తొలి మ్యాచ్ మాదిరిగానే ఇక్కడా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది..టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ కు మొగ్గు చూపవచ్చు.