India vs Bangladesh 1st Test: వన్డే సిరీస్ పరాజయం తర్వాత భారత్ బంగ్లాదేశ్ తో ఇవాళ మొదటి టెస్ట్ మొదలుపెట్టింది.. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు భారత్ ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.. బంగ్లా బౌలర్లలో టైజుల్ ఇస్లాం మూడు వికెట్లు తీశాడు. మెహిదీ హాసన్ మీరాజ్ రెండు వికెట్లు తీశాడు.

ఓపెనర్లు విఫలమయ్యారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టును ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ 22 పరుగులు చేసి.. ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుభ్ మన్ గిల్ 20 పరుగులు చేసి టైజుల్ ఇస్లాం బౌలింగ్ లో యాసిర్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మొన్న జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఒక పరుగు మాత్రమే చేసి టైజుల్ ఇస్లాం బౌలింగ్ లో ఎల్బీ డబ్ల్యూ గా ఔట్ అయ్యాడు. ఈ దశలో చతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అప్పటికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు.
ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో
పుజారా, పంత్ ఇద్దరు కలిసి సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. చెత్త బంతులను బౌండరీల వైపు తరలించారు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పంత్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు. ఆఫ్ సెంచరీ సాధిస్తాడు అనుకుంటున్న తరుణంలో హసన్ మిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. పుజారా తో కలిసి ఐదో వికెట్ కు 149 పరుగులు జోడించాడు.. వ్యక్తిగత స్కోర్ 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు పుజారా టైజుల్ ఇస్లాం బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. తర్వాత అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు వచ్చాడు.. అతడు కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.

అదరగొట్టారు
బంగ్లాదేశ్ బౌలర్లు మరోసారి సత్తా చాటారు.. మూడో వన్డేలో దారుణంగా ఓటమి చెందామనో, స్వదేశంలో ఆడుతున్నామనే తెలియదుగాని బంగ్లాదేశ్ బౌలర్లు రెచ్చిపోయారు.. పదునైన బంతులతో భారత బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టారు. టైజుల్ ఇస్లాం అయితే మూడు వికెట్లు తీశాడు. అయితే ఇదే సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కుదురుకోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.. తొలి రోజు ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.. కీలక బ్యాట్స్ మెన్ మొత్తం అవుట్ కావడంతో శ్రేయస్ అయ్యర్ మీద భారం పడింది.. ప్రస్తుతం అతడు 82 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి..