M. M. Keeravani: సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తల్లి నేడు కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన రాజమౌళి కీరవాణి ఇంటికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కీరవాణి తల్లిని మూడు రోజుల క్రితం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. నేడు ఆమె ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా కాపాడకోలేకపోయారు. కీరవాణి తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆమె దూరం అవుతారని ఊహించలేదు. కోలుకొని తిరిగి వస్తారని భావించగా ఆమె కన్నుమూయడంతో తీవ్ర వేదనకు గురవుతున్నారట.

కీరవాణి తండ్రి శివ శక్తి దత్త ప్రముఖ లిరిసిస్ట్, స్క్రీన్ రైటర్. నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ జానకిరాముడు చిత్రానికి శివశక్తి దత్త స్క్రీన్ రైటర్ గా పని చేశారు. అలాగే ఆయన ప్రొఫెషనల్ పెయింటర్. శివశక్తి దత్తకి స్వయానా తమ్ముడు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి-కీరవాణి కజిన్స్ అవుతారు. రాజమౌళికి వరుసకు పెద్దమ్మ అయ్యే కీరవాణి తల్లి నేడు తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తన కార్యక్రమాలు పక్కన పెట్టి కీరవాణి ఇంటికి చేరుకున్నారు.
కీరవాణి తల్లి మరణవార్త తెలిసిన చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కీరవాణి తల్లి భౌతికకాయాన్ని చిత్ర ప్రముఖులు, సన్నిహితులు సందర్శించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రేపు కీరవాణి తల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇక కీరవాణి తన తమ్ముడు రాజమౌళి జైత్రయాత్రలో తనవంతు సాయం అందించారు. రాజమౌళికి కీరవాణి ఆస్థాన సంగీత దర్శకుడు. రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఆర్ ఆర్ ఆర్ వరకు కీరవాణి సంగీతం అందించారు. ఎంత అన్నదమ్ములు అయినా రెండు దశాబ్దాలు కలిసి ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏదో ఒక దశలో వ్యక్తిగత లేదా క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం అనేది కామన్. కానీ రాజమౌళి-కీరవాణి అన్యోన్యమైన అన్నదమ్ముల్లా కలిసి ప్రయాణం చేస్తూ విజయాలు అందుకుంటున్నారు.