India vs Bangladesh 2nd Test Day 3: బంగ్లాదేశ్, భారత్ మధ్య మీర్పూర్ లో జరుగుతున్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. భారత్ ఏకపక్ష గెలుపు అనుకున్న ఈ టెస్టులో.. విజయం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. శనివారం రెండో టెస్ట్ మూడో రోజు ఆట ను ఓవర్ నైట్ స్కోర్ 7/0 తో ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఎనిమిదో ఓవర్ చివరి బంతికి అశ్విన్ బౌలింగ్లో శాంటో(5) ఎల్ బీ డబ్ల్యు గా వెనుతిరిగాడు.. ఇక సిరాజ్ వేసిన 13 ఓవర్లో మొమినుల్ హక్ (5) పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటికి బంగ్లాదేశ్ స్కోరు రెండు వికెట్లు నష్టానికి 39 పరుగులు. ఇదే ఊపులో భారత బౌలర్లు బంగ్లా స్కోరు 51 పరుగుల వద్ద ఉన్నప్పుడు షకీబ్ ఉల్ హాసన్ ను ఔట్ చేశారు. అతడు ఉనద్కత్ బౌలింగ్ లో గిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.. అప్పటికి తొలి సెషన్ ముగిసింది. ఈ సమయం లో క్రీజు లోకి వచ్చిన ముష్పీకర్ రహీం (7) అక్షర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. హసన్ మిరాజ్ కూడా(0) అక్షర్ బౌలింగ్ లో ఎల్బీ డబ్ల్యూ గా ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో లిటన్ దాస్, నురుల్ హాసన్ జాగ్రత్తగా ఆడారు.

దాస్ ను ఔట్ చేసి మలుపు తిప్పాడు
ముఖ్యంగా దాస్ అయితే 98 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 73 పరుగులు చేశాడు..అయితే ప్రమాదకరంగా మారుతున్న లిటన్ దాస్ ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. 31 పరుగులు చేసిన నురుల్ హాసన్ కూడా అక్షర్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. అయితే తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టస్కిన్ అహ్మద్ కూడా బ్యాట్ కు పని చెప్పాడు. 31 పరుగులు చేశాడు. అయితే ఇతడికి మిగతా వారి సహకారం లభించలేదు. టైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ వెంట వెంటనే వెను దిరగడంతో బంగ్లా ఇన్నింగ్స్ 231 వద్ద ముగిసింది. లిటన్ దాస్ 73 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాకీర్ హాసన్ 51, నూరుల్ హాసన్, టస్కిన్ అహ్మద్ 31 పరుగులు చేశారు. వీరు నలుగురు ఆ కాసేపు నిలబడక పోయి ఉంటే బంగ్లా ఆ మాత్రం కూడా స్కోర్ చేసి ఉండేది కాదు.
అక్షర్ సత్తా
భారత్ బౌలర్ల లో అక్షర్ సత్తా చాటాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి బంగ్లాను కష్టాల్లో నెట్టాడు. ముఖ్యంగా మిరాజ్, నురుల్ హాసన్ ను ఎల్బీ డబ్ల్యూ గా ఔట్ చేసిన విధానం ఈరోజు ఇన్నింగ్స్ కే హైలెట్. అశ్విన్, సిరాజ్ కూడా చెరో రెండు వికెట్లు తీశారు.

అంత ఈజీ కాదు
145 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను బంగ్లా బౌలర్లు వణికించారు. ముఖ్యంగా మొహిది హాసన్ మిరాజ్ నిప్పులు చెరిగాడు. శుభ్ మన్ గిల్, పూజారా, కోహ్లీ ని ఔట్ చేసి భారత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. స్పిన్ ట్రాక్ కు పిచ్ అనుకూలిస్తున్న నేపథ్యంలో బంగ్లా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే ప్రస్తుతం బంగ్లాకు 6 వికెట్లు, భారత్ కు వంద పరుగులు అవసరం. భారత్ వంద కొడుతుందా? బంగ్లా ఆరు వికెట్లు తీస్తుందా అనేది రేపటి తో తేలుతుంది..