India Squad For Sri Lanka: క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్.. అంటే ఆట తీరు కూడా జెంటిల్మెన్ మాదిరే ఉండాలి.. అంతేకానీ జట్టుకు ఎప్పుడూ భారం కాకూడదు. అలా తమకు భారమైన ఆటగాళ్ళను ఈసారి బీసీసీఐ వదిలించుకుంది. ప్రక్షాళనకు నడుం బిగించింది. వాళ్ళు సీనియర్ ఆటగాళ్లు అయినప్పటికీ… సెంచరీలు సాధించినప్పటికీ… మొహమాటం లేకుండా బయటకు పంపింది. మొత్తానికి ఎన్నాళ్లగానో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువకులకు స్వాగతం పలికింది.. ఇది తప్పు ఒప్పో తెలియదు కానీ… బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

యువకులకే జై
శ్రీలంకతో జరిగే మూడు t20, వన్డేల సిరీస్ లకు మంగళవారం భారత జట్టును ప్రకటించారు.. ఊహించినట్టుగానే పొట్టి ఫార్మాట్ లో డాషింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు.. అతడి డిప్యూటీగా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరిస్తాడు. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. అంతే కాదు బంగ్లాదేశ్ సిరీస్ లో విఫలమైన ఓపెనర్ ధవన్ కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. దీంతో కెప్టెన్ కు రోహిత్ కు జతగా గిల్ ఓపెనింగ్ చేస్తాడు.. రోహిత్ శర్మ బొటనవేలు గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో… అతడు ఆడతాడా లేదా అనేది సందేహంగా ఉంది. మరోవైపు టి20, వన్డే ఫార్మాట్లకు వికెట్ కీపర్ పంత్ ను పక్కన పెట్టడం గమనార్హం. పరిమిత ఓవర్లలో పంత్ ఇటీవల రాణించలేకపోతున్నాడు.. మరోవైపు వన్డేల్లో రాహుల్ కు కాకుండా హార్దిక్ పాండ్యా కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఇక కులదీప్, అక్షర్, చాహల్, సుందర్ రూపంలో భారత జట్టుకు నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్ దీప్ పేస్ దళాన్ని పంచుకోనున్నారు.
వచ్చేనెల మూడు నుంచి
వచ్చేనెల మూడు నుంచి ఏడో తేదీ వరకు టి20లు, పది నుంచి 15 వరకు వన్డే సిరీస్ జరుగుతాయి.. అయితే గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్ వన్డే సిరీస్ సమయానికి జట్టులో చేరతాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.. అలాగే తొలిసారి యువ పేసర్లు శివమ్ మావి, ముఖేష్ కుమార్ లకు టి20ల్లో బెర్త్ దక్కింది. ఐపీఎల్ మినీ వేలంలో ఈ ఇద్దరికీ భారీ ధర పలికిన విషయం తెలిసిందే.. ఇక కేఎల్ రాహుల్ వివాహం కారణంగా అతని కోరిక మేరకు టీ 20 ల నుంచి మేనేజ్మెంట్ తప్పించింది.

టి20 జట్టు ఇలా
హార్దిక్ పాండ్యా కెప్టెన్, ఇషాన్, రుత్ రాజ్, గిల్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్, హుడా, త్రిపాఠీ, శాంసన్, సుందర్, చాహల్, అక్షర్, ఆర్ష్ దీప్, హర్షల్, ఉమ్రాన్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.
వన్డే జట్టు
రోహిత్ శర్మ కెప్టెన్, గిల్, కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, ఇషాన్, హార్దిక్, సుందర్, చాహల్, కుల దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్శ్ దీప్.