Life Lessons: ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని, సమాజంలో మంచి గుర్తింపు సంపాదించాలని కోరుకుంటారు. కానీ విజయానికి అడ్డుగా నిలిచేది ఎప్పుడూ బయటి పరిస్థితులు మాత్రమే కావు. చాలా సందర్భాల్లో మనలోనే దాగి ఉన్న కొన్ని చెడు అలవాట్లు, ఆలోచనా విధానాలే మన పురోగతిని అడ్డుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చాలా మంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కారణం ఈ అంతర్గత శత్రువులేనని గుర్తించలేరు. మానసిక నిపుణుల ప్రకారం.. ప్రతీ వ్యక్తిలో ఉండే ఈ నాలుగు రకాల శత్రువులకు అవకాశం ఇవ్వడం వల్ల తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నవారవుతారు. మరి ఆ శత్రువులు ఎవరు? వారి నుంచి తప్పించుకోవడం ఎలా?
1. బద్ధకం.. కలలను దూరం చేసే నిశ్శబ్ద శత్రువు
బద్ధకం అనేది కేవలం పనిని వాయిదా వేయడం మాత్రమే కాదు. ఇది అవకాశాలను కోల్పోయేలా చేసే ప్రమాదకరమైన అలవాటు. ‘రేపు చేద్దాం’, ‘కొంచెం తర్వాత చూస్తాం’ అనే ఆలోచనలతో చాలా మంది ముఖ్యమైన పనులను వాయిదా వేస్తుంటారు. కానీ విజయం సాధించిన వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే వారు పనిని వెంటనే ప్రారంభించే అలవాటును పెంచుకున్నట్లు తెలుస్తుంది. బద్ధకం వల్ల సమయం వృథా అవుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, చివరకు లక్ష్యాలు కూడా దూరమవుతాయి.
2. తొందరపాటు.. మంచి అవకాశాలను కూడా నాశనం చేస్తుంది
కొన్ని సందర్భాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అయినా.. ఆలోచించకుండా తొందరపడి తీసుకున్న నిర్ణయాలు పెద్ద నష్టాలకు దారి తీస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు లేదా వ్యక్తిగత సంబంధాలు ఏవైనా సరే, ఓర్పు లేకుండా వ్యవహరించడం సమస్యలను సృష్టిస్తుంది. తొందరపాటు వల్ల పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం కోల్పోతాం. అందుకే మానసిక నిపుణులు ముఖ్యమైన నిర్ణయాల ముందు కాసేపు ఆలోచించి, లాభనష్టాలను అంచనా వేసి ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.
3. నిందించడం.. బాధ్యత నుంచి పారిపోయే అలవాటు
విజయం సాధించలేకపోయినప్పుడు చాలా మంది తమ తప్పులను అంగీకరించకుండా పరిస్థితులను, అదృష్టాన్ని లేదా ఇతర వ్యక్తులను నిందిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకునే అవకాశం ఉండదు. జీవితంలో ఎదగాలంటే ముందుగా మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహించడం నేర్చుకోవాలి. ప్రతి వైఫల్యంలో ఒక పాఠం దాగి ఉంటుంది. ఆ పాఠాన్ని గుర్తించకుండా ఇతరులను నిందించడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది.
4. ఈగో.. ఎదుగుదలను అడ్డుకునే కనిపించని గోడ
ఈగో అనేది వ్యక్తిని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. ‘నాకే అన్నీ తెలుసు’, ‘నేను తప్పు చేయను’ అనే భావన మనిషిని కొత్త విషయాలు నేర్చుకోకుండా అడ్డుకుంటుంది. విజయవంతమైన వ్యక్తుల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం వినయం. వారు తమ తప్పులను అంగీకరిస్తారు. ఇతరుల సలహాలను స్వీకరిస్తారు.నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈగో ఎక్కువైతే సంబంధాలు దెబ్బతింటాయి. అవకాశాలు తగ్గిపోతాయి. వ్యక్తిగత అభివృద్ధి కూడా నిలిచిపోతుంది.
ఈ నాలుగు శత్రువులను ఎలా జయించాలి?
ఈ నాలుగు లక్షణాలను పూర్తిగా తొలగించడం ఒక్కరోజులో సాధ్యం కాదు. కానీ చిన్నచిన్న మార్పులతో వాటిని నియంత్రించవచ్చు. పనులను వాయిదా వేయకుండా వెంటనే ప్రారంభించడం, నిర్ణయాల ముందు ప్రశాంతంగా ఆలోచించడం. తప్పులను అంగీకరించడం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటి అలవాట్లు పెంచుకుంటే జీవితంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ప్రతి రోజు మన ప్రవర్తనను మనమే పరిశీలించుకోవడం కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
