Punam Rai: ఒక చిన్న చీమ పెద్ద కొండను ఎక్కగలుగుతున్నప్పుడు, మరి మనుషులమైన మనం ఒక చిన్న విజయాన్ని సాధించలేమా ? అనిపిస్తుంది ఆమె కథ వింటే. ఎవరైనా వెన్ను విరిగితే.. ఇక జీవితాన్ని చాలించాలి అనుకుంటారు. భయం, బాధల మధ్యలో ఏడుస్తూ కాలాన్ని తిట్టుకుంటూ, దేవుడిని తప్పు పడుతూ చివరి వరకూ అదే నిరుత్సాహంతో మగ్గిపోతూ ఉంటారు. కానీ, ఆమె అలా చేయలేదు. వెన్ను విరిగినా జీవితాన్ని గెలవాలనుకుంది. నిజంగానే జీవితాన్ని గెలిచింది.

ఆమె పేరు పూనమ్ రాయ్. పుట్టింది బిహార్ లోని వైశాలిలో. 1995లో ఆమెకు పెళ్ళయింది. భర్త మంచి వాడు అని, పైగా ఇంజనీరింగ్ అని అబద్దాలు చెప్పి.. ఆమెకు ఇచ్చి పెళ్లి చేశారు. కట్నంగా డబ్బుతో పాటు ఎన్నో కానుకలు తీసుకున్నారు. కానీ.. తీరా అత్తవారింటికి వెళ్ళాక గానీ, అసలు విషయం అర్ధం కాలేదు. అతను చదివింది ఇంటర్ వరకు అని. భారీగా కట్నం తీసుకుని చదువు విషయంలో మోసగించినా ఆమె అన్నీ దిగ మింగుకుంది.
Also Read: కోవిడ్ సోకిన గర్భిణికి ప్రాణం పోసిన ‘మెడికవర్’ వైద్యులు
కానీ పెళ్ళై నెల రోజులకే ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ఉంటే తట్టుకోలేక, పుట్టింటికి పారిపోయి వచ్చింది. అప్పటికే నెల తప్పింది. రెండు నెలల తర్వాత భర్త వచ్చి ఆమెను మళ్లీ ఇంటికి తీసుకు వెళ్ళాడు. అంతలో ఆమెకు అమ్మాయి పుట్టింది. ఆడపిల్ల పుట్టడానికి ఆమె కారణమంటూ పూనమ్ రాయ్ ను తీవ్రంగా కొట్టారు. ఆమె ఎదురు తిరిగింది.
భర్తలో కోపం రెట్టింపు అయింది. ఆమెను అలాగే ఎత్తుకుని పైకి తీసుకువెళ్ళాడు. ఆమెకు అర్ధం కాలేదు. అతను ఏమి చేస్తున్నాడో.. గతంలో ఇలాగే అతను కొన్ని సార్లు బలవంతపెట్టి నీచపు ఆనందాన్ని అనుభవించేవాడు. ఇప్పుడు కూడా అతను అలాగే చేస్తున్నాడు అనుకుంది. కానీ, అతను మూడో అంతస్తు మీద నుంచి ఆమెను కిందికి తోసేసాడు. ఇక ఆ తర్వాత అపస్మారక స్థితి.. శరీరం పూర్తిగా చచ్చుబడిపోవడం.. చివరకు ఆమె జీవితంలో మళ్ళీ నడవలేదు అని తేల్చి చెప్పారు డాక్టర్లు.
కానీ ఆమె ఈ జన్మలోనే మరో జన్మ ఎత్తింది. కృత్రిమ అవయవాల సాయంతో నిలబడింది.. జీవితంలో కూడా. ఆత్మరక్షణ కోసం, ఆత్మవిశ్వాసం పెరగడం కోసం, దేహదారుఢ్యం కోసం తైక్వాండో శిక్షణలో చేరింది. చివరకు అదే స్కూల్ పెట్టి పెద్ద స్థాయికి ఎదిగింది. ‘బిందేశ్వర్‌రాయ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి వారణాసి తైక్వాండో అసోసియేషన్ సహకారంతో తైక్వాండో నేర్పుతుంది. ఎందరికో సాయం చేస్తోంది.
[…] Also Read: చిన్న చీమ కొండను ఎక్కుతుంటే.. మనుషులం… […]