
Ravindra Jadeja: టీమిండియా గెలిచిన ఆనందం క్షణాల్లో ఆవిరైంది. చేయని తప్పుకు దోషిగా నిలబడ్డాడు. ప్రత్యర్థుల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొన్నాడు. తన నిజాయితీని నిరూపించుకున్నాడు. అయినా సరే నిబంధనలకు తలొగ్గాడు. ఐసీసీ ఆదేశాలను పాటించాడు. ఆటలోనే కాదు.. నిజ జీవితంలో కూడా జెంటిల్మెన్ అని నిరూపించుకున్నాడు.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పై ఐసీసీ జరిమానా విధించింది. ఓ డీమెరిట్ పాయింట్ తో పాటు.. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ జరిగింది. ఈ సందర్భంగా అంపైర్ల అనుమతి లేకుండా జడేజా చేతి వేలికి ఆయింట్ మెంట్ రాసుకున్నాడు. ఇది కెమెరాల్లో రికార్డు అయింది. దీనిపై ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. జడేజా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించారు. జడేజా వేలికి ఏం పూసుకున్నాడు ? ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు ? అంటూ మాజీ క్రికెటర్లు మైకెల్ వాన్, టీమ్ పైన్ అనుమానం వ్యక్తం చేశారు.
జడేజా వ్యవహారం పై ఐసీపీ విచారణ జరిపింది. ఈ విచారణలో జడేజా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడలేదని తేలింది. బాల్ ఆకారాన్ని దెబ్బతీసేందుకు జడేజా ప్రయత్నించలేదని ఐసీసీ తేల్చి చెప్పింది. ఆయింట్ మెంట్ ను అందుకోసం ఉపయోగించలేదని చెప్పింది. అయితే.. అంపైర్ల అనుమతితో ఆయింట్ మెంట్ రాసుకుని ఉండాల్సిందని సూచించింది. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో డీమెరిట్ పాయింట్ తో పాటు మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మరో రెండు డీమెరిట్ పాయింట్లు వస్తే.. జడేజా ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

ఆస్ట్రేలియా మీడియా ఆరోపణలను భారత మీడియా గట్టిగా తిప్పికొట్టిందని చెప్పవచ్చు. జడేజా వేలు నొప్పి పుట్టడంతోనే ఆయింట్ మెంట్ రాసుకున్నట్టు వివరణ ఇచ్చింది. కానీ అంతకు మునుపే ఆస్ట్రేలియా మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. లేని విషయాన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం చేసింది. ఐసీసీ వివరణతో చివరికి తోక ముడిచింది. కానీ రవీంద్ర జడేజా చేయని తప్పుకు శిక్షను ఎదుర్కొన్నాడని చెప్పవచ్చు. ఇండియా గెలిచిన ఆనందంలో ఉన్న జడేజాకు.. ఈ ఆరోపణలు ఇబ్బంది కలిగించాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఐసీసీ విచారణలో కడిగిన ముత్యంలా జడేజా బయటికొచ్చారు.