Husband And Wife Relationship: ప్రతి మనిషి రాగద్వేషాలకు అతీతుడు కాడు. అందరిలోనూ ఎదుటివారిపై కాసింత ఈర్ష్య, అసూయ లాంటివి గూడుకట్టుకుని ఉంటాయి. అవి సందర్భం వచ్చినప్పుడు పడగ విప్పుతాయి. దీంతో అతడికి నష్టాలే వస్తాయి. అసూయ మందులేని రోగం లాంటిది. మనసులో ఒకసారి ఎదుటి వ్యక్తిపై అసూయ ఏర్పడితే ఇక దాన్ని తగ్గించడం కష్టమే. ఎందుకంటే కొందరు జీవిత భాగస్వామి మీద కూడా అసూయ పడుతుంటారు. ఇలా జరిగితే వారి కాపురంలో కలతలు మొదలవుతాయి. అవి విడాకుల వరకు దారి తీసే సూచనలు ఉన్నాయి.

ప్రపంచంలో చాలా మంది జంటలు కౌన్సెలింగ్ కు వచ్చినప్పుడు వారు వెల్లడించిన అభిప్రాయాల్లో తమ భాగస్వామే తమపై అసూయ పడుతున్నాడని చెబుతున్నారు. దీంతో అసూయ అనేది ఓ రోగంలా మారుతోంది. పచ్చని సంసారాల్లో చిచ్చులు పెడుతోంది. నూరేళ్లు హాయిగా సాగాల్సిన దాంపత్యంలో అసూయ అనే వైరస్ ప్రవేశించి కకావికలం చేస్తోంది. ఇతరులతో పోల్చుకోవడం, మనల్ని తక్కువ చేసి చూసుకోవడం వల్ల అభద్రతా భావం పెరిగి అసూయ పుడుతుంది.
జీవిత భాగస్వామి తాను గీసిన గీత దాటద్దని అనుకుని ప్రేమ చూపిస్తుంటాడు. లేనిపోని ఆంక్షలు పెట్టి వారిపై రుద్దేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో విసుగు పుట్టి మిమ్మల్నిదూరం పెట్టడం సహజమే. జీవిత భాగస్వామిపై నమ్మకం ఉండాలి. అది పోయిన నాడు ఇక జీవితం నరకమే. పెళ్లి తరువాత తమ జీవితం ఇలా ఉండాలని అందరు కలలు కంటుంటారు. కానీ అలా లేకపోయే సరికి నిరాశ పడుతుంటారు. దీంతోనే అసూయ పడుతుంటారు. నిజాయితీకి పెద్దపీట వేయండి. అనుబంధాన్ని గుర్తు చేసుకోండి. భాగస్వామిపై అజమాయిషీ చెలాయించకండి. ఇవన్నీ పాటిస్తే అసూయ అనేది మీ ఆలోచనలకు కూడా రాదు. దీంతో జీవితం నందనవనంగా మారుతుందనడంలో సందేహం లేదు.

అసూయను దూరం చేసుకోవాలంటే ఇద్దరి మధ్య దూరం తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిజాన్ని గుర్తించి అబద్ధాలు లేకుండా చూసుకోవాలి. నిజాయితీతో ఉంటే ఎలాంటి అసూయ కూడా మిమ్మల్ని విడదీయలేదు. దంపతుల మధ్య శృంగారమే అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది. ఇవన్నీ దూరంగా ఉండాలంటే ముందు మీరిద్దరు దగ్గర కావాలి. భాగస్వామి చేసే పనిని నిజాయితీగా ప్రశంసించండి. దీంతో ఇద్దరి మధ్య అసూయ బదులు ప్రేమ చిగురిస్తుంది. బంధం బలోపేతం అవుతుంది. ఇలా జీవిత భాగస్వామిపై అసూయ పడేబదులు ప్రేమ చూపించి దగ్గరకు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గ్రహించుకోండి.