చైనా పొరుగు దేశాలపై కుట్రలు చేయడం సాధారణమే. ఇటు భారత్ ను ఇరుకున పెట్టే క్రమంలో దూకుడుగా వ్యవహరించే డ్రాగన్ పక్కనున్న తైవాన్ ను సైతం భయాందోళనకు గురిచేస్తోంది. ఇందులో భాగంగా ఆ దేశ గగనతలంలో విమానాలు పంపుతూ వారిలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. 2025 నాటికి చైనా(China)తమ దేశంపై దండయాత్ర చేస్తుందని ఆ దేశ నాయకులు చెబుతున్నారు. చైనా చేస్తున్న కవ్వింపులకు తైవాన్ రక్షణ మంత్రి చై కూచెంగ్ పార్లమెంట్ లోనే ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
ఇటీవల డ్రాగన్ 52 యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపింది. క్రమంగా విమానాల సంఖ్య పెంచుకుంటూ పోతోంది. అసలు దీనికి ప్రధాన కారణం భారత్ తో ఒప్పందం కుదుర్చుకోవడమే అని తెలుస్తోంది. భారత్ లో సెమీకండర్లర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పే క్రమంలో రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని భావించి చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది.
గతంలో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న ట్రంప్ తైవాన్ విషయంలో డ్రాగన్ ను కట్టడి చేయడంలో దూకుడుగా వ్యవహరించారు. దీంతో చైనా ఎలాంటి చర్యలకు దిగలేదు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం దీనిపై పట్టించుకోవడం లేదు. దీంతోనే డ్రాగన్ తన కుట్రలను అమలు చేస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తో సత్సంబంధాలు కొనసాగడంపై డ్రాగన్ ఓర్వలేకపోతోంది.
గత కొన్నేళ్లుగా డ్రాగన్ దాయాది దేశాలతో గొడవలు పెట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. తైవాన్ పై అకస్మాత్తుగా దాడి చేసేందుకే చైనా కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్ కు చేయూతనిచ్చేందుకు దేశాలు ముందుకు వస్తున్నా చైనా తన కుట్రలు ఇంకా ఎక్కువ చేస్తోంది. దీంతో చైనాను కట్టడి చేసే చర్యలకు ప్రపంచ దేశాలు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
