Home Loan: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే మనిషి జీవితంలో ఇవి రెండూ చాలా కష్టమైనవి అని పెద్దల అభిప్రాయం. ప్రస్తుతం అనేక కష్టాలు వచ్చాయనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు సగటు మధ్యతరగతి ప్రజలు సొంతింటి కల నెరవేర్చుకోవడం చాలా కష్టంగా మారుతోంది. పెరిగిన ధరలతో స్థలం కొనగడమే గగనమవుతోంది. ఇక స్థలం కొని ఇల్లు కట్టుకోవడం రాబోయే రోజుల్లో అందని ద్రాక్ష చందంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అయితే వేతన జీవులు, వ్యాపారులు ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు చాలా మంది తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి బ్యాంకుల రుణాలపైనే ఆధారపడుతున్నారు. వాయిదాల్లో చెల్లిస్తే ఇల్లు సొంతం అవుతుందన్న ఆలోచనతో చాలా మంది రుణాలకు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తున్నాయి. అయితే రుణం తిరిగి చెల్లించడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న వడ్డీ రేట్లతో రుణ గ్రహీతలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు పెరిగిన ఇళ్ల ధరలు.. ఇంకోవైపు పెరిగిన వడ్డీ భారంతో చాలా మంది ఇళ్లు అమ్మకానికి పెడుతున్నారు.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు గత నాలుగేళ్లలో 80% పెరిగాయి. దేశవ్యాప్తంగా చూస్తే, స్థిరాస్తి ధరల్లో అత్యధిక పెరుగుదల ఇదేనని ’మ్యాజిక్ బ్రిక్స్’ అనే స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థ తాజా అధ్యయనం తెలిపింది. దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులతో, ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. కానీ ప్రజల ఆదాయాలు ఆ స్థాయిలో పెరగకపోవడంతో.. ఇళ్ల కొనుగోలు కోసం చేసిన రుణాలకు నెలవారీ కిస్తీల భారం అధికమవుతోందని సంస్థ వివరించింది.
మ్యాజక్ బ్రిక్స్ అధ్యయనం ప్రకారం..
2020– 24 మధ్య దేశంలోని 10 నగరాల్లో ప్రజల ఆదాయాల్లో వృద్ధి 5.4 శాతమే. అదే సమయంలో ఇళ్ల ధరలు 9.3% పెరిగాయి. దీని వల్ల ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గింది.
– ఇళ్ల ధరలు హైదరాబాద్‌లో 80 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది.
– ముంబయి, ఢిల్లీ నగరాల్లో ఇళ్ల ధరలు మధ్యతరగతి వర్గీయులు భరించలేని స్థాయిలో ఉండగా, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో కొంత అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయి.
– నెలవారీ ఆదాయంలో ఇంటి రుణం కోసం చెల్లిస్తున్న ఈఎంఐ వాటా, మనదేశంలో 2020లో సగటున 46% కాగా, 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. అంటే ఇళ్ల కొనుగోలుదార్లపై ఈఎంఐ భారం అనూహ్యంగా పెరిగింది.
– నెలవారీ ఆదాయంలో ఈఎంఐ వాటా ముంబయిలో 116%, ఢిల్లీలో 82%, హైదరాబాద్లో 61 శాతంగా ఉంది. అంటే ఈ నగరాల్లో ప్రజలు తమ కుటుంబ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఇంటి రుణం వాయిదా చెల్లించడానికే కేటాయిస్తున్నారు. అహ్మదాబాద్ చెన్నై నగరాల్లో ఇది 41%, కోల్‌కతాలో 47 శాతంగా ఉంది. అంటే ఇళ్ల ధరలు ఈ మూడు నగరాల్లో కొంత అందుబాటులో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ధరలతోపాటు, వడ్డీ రేట్లు..
’మ్యాజిక్ బ్రిక్స్’ సీఈఓ సుధీర్ పాయ్ మాట్లాడుతూ 2021, 2022 సంవత్సరాల్లో తక్కువ వడ్డీ రేట్లకు తోడు. ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటంలో అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అన్నారు. ఆదాయాలకు మించి ఇళ్ల ధరల్లో పెరుగుదల చోటుచేసుకోవడంతో, డిమాండ్ మందగించినట్లు వివరించారు. కొంతకాలంపాటు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో పెరుగుదల అంతగా ఉండకపోవచ్చని అంచనా వేశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More