Heart Attack: ఆ మధ్య కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు తెలుసు కదా! యావత్ కన్నడ మొత్తం కన్నీరు పెట్టుకుంది. అభిమానులు అతడు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు. భాషా భేదం లేకుండా నటీనటులు నివాళులర్పించారు. ఇలా ఎందుకు జరిగింది అని ఆరా తీస్తే.. మితిమీరిన జిమ్ చేయడం వల్ల గుండె మీద ఒత్తిడి పెరిగి పోటుకు గురైంది. శరీరానికి రక్తం సరఫరా కాకపోవడంతో ప్రాణం పోయింది. తాజాగా వైద్య అధ్యయనాల ప్రకారం దేశంలో జిమ్ చేసే వారిలో కోటిమంది గుండెపోటు ముప్పుకు దగ్గరలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.. మితిమీరిన జిమ్ చేయడం, కొవ్వు పెరిగే ఆహారం తినడం, వంశపారంపర్య లక్షణాలు, మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం గుండెపోటుకు దారి తీస్తున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మాత్రమే కాకుండా గత ఏడాది జిమ్ చేస్తూ సుమారు 250 మంది దాకా గుండెపోటుతో కుప్పకూలిపోయారని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువ శాతం 30 ఏళ్లలోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది
తాజా అధ్యయనాల ప్రకారం జబ్బులతో బాధపడే వారి సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 30 ఏళ్ల లోపు వారిలోనూ గుండెకు సంబంధించిన సమస్యలు బయటపడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు పూర్తిగా మూసుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. దీనినే వైద్య పరిభాషలో స్టెమీగా పిలుస్తారు. ఇలా గుండెపోటు వచ్చిన వారికి త్రాంబో లైసిన్ ఇంజక్షన్ ఇస్తే ప్రాణాలు పడవచ్చు. 6 గంటల పాటు వారికి ఎటువంటి ప్రాణహాని ఉండదు.
వయసుల వారీగా ఇలా..
దేశ వ్యాప్తంగా గుండె సమస్యలు ఉన్న పది శాతం మందిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. వీరిలో 4.2% మంది 30 ఏళ్ల లోపు వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఇటీవలి అధ్యయనాల ప్రకారం జిమ్ ఎక్కువగా చేసేవారు గుండెపోటు బారిన పడుతున్నారు. సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కఠినమైన వ్యాయామాలు చేయకుండా జిమ్ లో 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు కసరత్తులు చేస్తే సరిపోతుందని వైద్యులు అంటున్నారు. ఇప్పటి తరం సిక్స్ ప్యాక్ బాడీని కోరుకుంటున్నారని, సినీ తారల మాదిరి తమ దేహాకృతిని మార్చుకోవాలని, శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. క్వాలరీలు లెక్క వేసుకుని తినడం వల్ల.. శరీరం ఒక్కోసారి సరైన స్థాయిలో పోషకాలను గ్రహించలేకపోతోంది. ఇది అంతిమంగా గుండెపై ఒత్తిడి పెంచుతోంది.. ఇదే సమయంలో వారు తీవ్రంగా జిమ్ లో వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు వస్తోంది.

తీవ్ర సమస్య
దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల మంది గుండెపోటుతో చనిపోతున్నారు.. వీరిలో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. ఇక కొద్దిపాటి దూరం నడిచినా, పనిచేసిన తీవ్ర ఆయాసం వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే విపరీతంగా చెమటలు పట్టడం, గుండె దడ, అలసట రావడం, కాళ్ల వాపు, తల తిరగడం, స్ప్రహ కోల్పోవడం, చాతి మధ్య భాగంలో నొప్పిగా అనిపించడం, బరువు పెట్టినట్టు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యమంలో వ్యాయామం చేస్తే గుండె మీద ఒత్తిడి పెరిగే గుండెపోటు వస్తుంది.. రక్తపోటు, మధుమేహం, పొగ తాగడం, గుట్కాలు, పొగాకు నమలడం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉండడం, వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉన్న వారిలో హృదయ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి..