Indian Cricket: ఏడాదికాలంగా టీం ఇండియా, బీసీసీఐ ప్రయాణం ఎవరికీ అర్థం కావడం లేదు.. అంతుచిక్కడం లేదు. పారద్శకత అన్న పదం.. మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే బీసీసీఐ భ్రష్టుపట్టిందనేమాట కొత్త కాదు… చాలా కాలం నుంచినే ఈ అభిప్రాయాలున్నాయి. దేశంలో క్రికెట్ చుట్టూ ధనం ఎప్పుడైతే పోగైందో, క్రికెట్ మోస్ట్ గ్లామరస్ ఎప్పుడు అయ్యిందో అప్పటి నుంచి బీసీసీఐ చుట్టూ రాజకీయ నేతలు చేరారు. రాజకీయం ఎంటర్ అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అనడానికి పరాకాష్టగా బీసీసీఐ నిలుస్తోంది. దేశంలో వివిధ రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు ఆయా రాష్ట్రాల రాజకీయ నేతలే బాస్‌లు అయ్యారు! సౌత్‌లో ఈ జాడ్యం పెద్దగా లేదు. అయితే నార్త్‌లో చాలా రాష్ట్రాల్లో క్రికెట్‌ను రాజకీయాలే శాసిస్తున్నాయి.

గతంలో కొందరు రాజకీయ నేతలు ఏకంగా బీసీసీఐ ప్రెసిడెంట్ పదవినే తీసుకున్నారు. మహారాష్ట్ర క్రికెట్ లో తీవ్రంగా ఇన్ వాల్వ్ అయ్యి, ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాడు శరద్ పవార్. కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్నప్పుడు భారత క్రికెట్లో పవార్ ఏం చెబితే అది జరుగుతోందనే అభిప్రాయాలు వినిపించాయి. అదే సమయంలో బీజేపీ వైపు నుంచి అరుణ్ జైట్లీ లాంటి వాళ్లు ఢిల్లీ క్రికెట్ ను శాసించారు. బీసీసీఐ వ్యవహారాల్లో పాలుపంచుకున్నారు. రాజకీయంగా విబేధించుకున్నా అలా క్రికెట్ పై ఆధిపత్యం విషయంలో రాజకీయ పార్టీల నేతలన్నీ ఏకం కావడం కొత్త కాదు.
బీజేపీ అదే చేస్తోంది..
బీజేపీ ఆరోపిస్తున్నట్లు.. కాంగ్రెస్ అంటే దురాగతాల పార్టీ అనుకుందాం. మరి ఇప్పుడు కూడా పరిస్థితి అంతకన్నా భిన్నంగా లేదు. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా తనయుడు జైషా బీసీసీఐని అంతా తానై నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లు క్రీడలను కూడా రాజకీయమయం చేశారని బీజేపీ వాళ్లు ఆరోపించడానికి కూడా ఏమీ మిగల్లేదు. ఇప్పుడు బీసీసీఐ కోశాధికారిగా జైషా అంతా తానవుతున్నారు. గతంలో కోశాధికారులు బీసీసీఐకి ఉండే వారు కానీ, జైషా అంత స్థాయిలో వారి పేర్లు మార్మోగలేదు. ఇప్పుడు బీసీసీఐలో ఏం జరిగినా అంతా జైషా పుణ్యమే అని సర్వత్రా వినిపించే మాట. దీన్ని పాజిటివ్ ప్రచారంగా మలుచుకుంటూ ఉన్నారు.
లోథా సంస్కరణల ఆయనకు వర్తించవా?
లోథా సంస్కరణల్లో భాగంగా గంగూలీని బీసీసీఐ అధ్యక్ష హోదా నుంచి తప్పించిన జైషా కూడా తప్పుకోవాలి కదా! కానీ ఎవ్వరూ ప్రశ్నించరు. అదేమంటే రోజర్ బిన్నీని బీసీసీఐ ప్రెసిడెంట్ గా చేశారు అనే మరో వాదన. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ పేరు కన్నా కోశాధికారి పేరే అమితంగా వినిపిస్తోందిప్పుడు. జట్టులో సభ్యత్వాల విషయంలో కూడా ఈ ప్రభావం లేకపోలేదనే వాదనా ఉంది. భారత క్రికెట్ జట్టుకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా దాదాపు అప్రకటితశాశ్వత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను చేసేశారు. కేఎల్ రాహుల్ కెప్టెన్ అయినప్పుడు పాండ్యా కావడానికి ఏముందనొచ్చు. అయితే కేవలం రోహిత్ లేనప్పుడే రాహుల్ కెప్టెన్ అయ్యాడు. అలాగే కొహ్లీ లేనప్పుడు రహనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే పాండ్యా వ్యవహారం అలా లేదు. పూర్తి స్థాయిలో పరిమిత ఓవర్ల కెప్టెన్ అని చెప్పుకుండానే హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసేశారు. ఒక దశలో కపిల్ తర్వాత ఇతడే అనిపించినా.. పాండ్యా ఆ స్థాయిలో సత్తా చూపింది ఏమీ లేదు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో కూడా పాండ్యా బౌలింగ్‌లో ఎప్పుడు తన పూర్తి కోటా వేసిన సందర్భం లేదు.

ప్రధాని రాష్ట్రానికి ప్రాధాన్యం…
ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించుకోవచ్చు. 90లలో దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత క్రికెట్ జట్టులో ఆరేడు మంది కర్ణాటక క్రికెటర్లు చోటు దక్కించుకునే వాళ్లు. ఒక మ్యాచ్ లో అయితే ఏకంగా ఏడు మంది కర్ణాటక క్రికెటర్లు ఆడారు. అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, రాహుల్ ద్రావిడ్ లకు తోడు సునీల్ జోషీ, భరద్వాజ్ .. వీళ్లంతా ఒకే మ్యాచ్‌లో ఆడటం అప్పుడు ఒక ఆశ్చర్యం. వీరిలో మొదటి నలుగురి పేర్లపై పెద్దగా అభ్యంతరాలు ఉండేవి కావు కానీ, ఏకంగా ఆరేడు మంది కర్ణాటక క్రికెటర్లు 11 మందిలో ఉండటం మాత్రం అంతా ప్రధాని ఆదేశాల మేరకే అనే టాక్ ఉండేది. ఆ దశలోనే దొడ్డ గణేష్ కన్నడీగులు కూడా జాతీయ జట్టుకు ఆడారు. ఇప్పుడు తరిచి చూస్తే.. భారత క్రికెట్ జట్టులో గుజరాతీల నంబర్ అంతకు తక్కువేమీ లేదు.. అదీ గుజరాతీల ఆట మరి!