FSSAI Fruit Rules: మార్కెట్లోకి వెళ్లగానే కొన్ని పండ్లు నిగనిగలాడుతాయి. ఇవి ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ వీటిని కృత్రిమంగా పండించి విక్రయిస్తుంటారు. ఇలా చాలా మంది కృత్రిమంగా పండించిన పండ్లను తినడంతో అనారోగ్యాల పాలవుతున్నారు. దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో Food Safety and Standards Authority of India (FSSAI) అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్న నేపథ్యంలో కఠిన చర్యలకు దిగింది. ముఖ్యంగా ‘మసాలా’గా పిలిచే కాల్షియం కార్బైడ్ వినియోగం ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తనిఖీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
తోటలో పండ్లు కావాలంటే చాలాకాలం పడుతుంది. దీంతో కాయలు త్వరగా పండ్లు కావడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇది నీటితో ప్రతిచర్యకు లోనై అసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు పండ్లలో సహజంగా ఏర్పడే ఇథిలీన్ గ్యాస్‌లా పనిచేసినా, ఇందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి విషపదార్థాలు మన ఆరోగ్యానికి హానికరం. దీని వల్ల చర్మ సమస్యలు, కంటి చికాకులు, గొంతు ఇబ్బందులు, వాంతులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కొందరు వ్యాపారులు ఇథిలిన్ ద్రావణంలో పండ్లను నేరుగా ముంచడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే FSSAI స్పష్టంగా చెప్పినట్టుగా, ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. పండ్ల పక్వానికి ఇథిలీన్ గ్యాస్‌ను నియంత్రిత వాతావరణంలో మాత్రమే ఉపయోగించాలి. ద్రావణంలో ముంచడం వల్ల రసాయన అవశేషాలు పండ్లపై మిగిలి వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మార్కెట్లు, గోదాములు, సరఫరా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటంలో రాజీపడబోమని FSSAI స్పష్టం చేసింది.
వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా ప్రకాశవంతమైన రంగు, అసహజమైన మృదుత్వం ఉన్న పండ్లు కొనుగోలు చేసే ముందు పరిశీలించాలి. పండ్లను తినే ముందు బాగా కడగడం, కొన్ని సందర్భాల్లో ఉప్పునీటిలో నానబెట్టడం మంచిదని చెబుతున్నారు. సహజంగా పండిన పండ్లను ఎంపిక చేసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు.
కృత్రిమంగా పండించిన పండ్లపై నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వినియోగదారుల ఆరోగ్య భద్రతకు ఎంతో కీలకంగా మారాయి. ఈ నియమాలను కచ్చితంగా అమలు చేస్తేనే మార్కెట్లో నాణ్యమైన పండ్లు అందుబాటులోకి వస్తాయి.