Salman Butt: టి20 మెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత జట్టు చివరి వరకు పోరాడి ఉత్కంఠ మధ్య గెలిచింది. ఈ మ్యాచ్ ముగిసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇంకా దీని గురించి చర్చ సాగుతూనే ఉంది. అయితే ఈసారి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆ దేశ క్రీడాకారులపై విరుచుకుపడ్డాడు. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ పై విశ్లేషణ చేశాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో తమ దేశ ఆటగాళ్లు శ్రద్ధ పెట్టలేదని, భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా ఆటలో నిమగ్నమై పోవడంతోనే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని జట్టును విజయ తీరాల వైపు నడిపించాడని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక సెలక్షన్ కమిటీ ప్రాథమిక అంశాలను కూడా విస్మరించిందని తప్పుపట్టాడు.. చివరి ఓవర్ నాలుగో బంతి కచ్చితంగా నోబాలే అని పేర్కొన్నాడు.. మ్యాచ్ లో చివరి వరకు విజయం ఇరుపక్షాల మధ్య ఉందన్నాడు. కేవలం విరాట్ కోహ్లీ పోరాట స్ఫూర్తితోనే భారత్ గెలిచిందని పేర్కొన్నాడు.

నో బాల్ విషయానికి వస్తే
“ఇక ఈ మ్యాచ్ లో కీలకమైన నో బాల్ విషయానికి వస్తే బంతి బ్యాట్ కు కనెక్ట్ అయ్యే సమయంలో బ్యాటర్ నడుము కంటే కొంచెం ఎత్తులో ఉంది. అంటే అది కచ్చితంగా నోబాల్ అని అర్థం. ఆ బంతికి విరాట్ సిక్స్ కొట్టాడు. ఒకవేళ అదే వికెట్ పడితే నోబాలా కాదా అనే అంశంపై థర్డ్ ఎంపైర్ కి వెళ్ళవచ్చు. అంటే ఈ మ్యాచ్ లో థర్డ్ ఎంపైర్ వద్దకు వెళ్లే అవకాశమే లేదు. రన్ అవుట్, బంతిని చేతితో ఆపడం, ఫీల్డింగును అడ్డుకోవడం, రెండుసార్లు బంతిని కొట్టడం వంటివి జరిగితేనే అవుట్ గా ఇస్తారు. ఇవి కాకుండా ఏం జరిగినా అవుట్ కాదు. ఇక్కడ బంతి వికెట్లను తాకి థర్డ్ మెన్ వైపు వెళ్ళింది. ఈ సమయంలో ఆటగాళ్లకు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కచ్చితంగా ఉండాలి. అది ఉన్నది కాబట్టే భారత ఆటగాళ్లు మూడు పరుగులు తీయగలిగారు. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ క్రీడాకారులు అవగాహన లేకుండా ఎంపైర్ తో వాగ్వాదానికి దిగారు.
నిబంధనలు తెలిసి ఉండాలి
ప్రపంచవ్యాప్తంగా లీగ్ ఆడే పాకిస్తాన్ ఆటగాళ్లకు క్రికెట్ నిబంధనలు తెలిసి ఉండాలి. క్రికెట్ చట్టాలు, వాటిని సందర్భానికి అన్వయించుకునే విషయానికి వస్తే ఒక ఉదాహరణ. కిందటి ప్రపంచ కప్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ హఫీజ్ వేసిన బంతిని సిక్స్ కొట్టాడు.. వాస్తవానికి ఆ బంతి హఫీజ్ చేయి జారి పిచ్చి మధ్యలో పడింది. అది నో బాల్. రెండుసార్లు నేలను తాకిన బంతిని కూడా చాలా అవగాహనతో వార్నర్ సిక్సర్ గా మలిచాడు. బంతికి అతడు అవుట్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాడు. విషయంపై స్పష్టమైన అవగాహన ఉండడంతో ధైర్యం చేసి సిక్స్ కొట్టాడు. దీంతో సిక్స్, నో బాల్, ఫ్రీ హిట్ ఏకకాలంలో లభించాయి. అప్పుడు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంపైర్ తో చర్చలు జరిపారు.

క్రికెట్ చట్టాలను అన్వయించుకోవడం, తెలుసుకోవడంలో ఇది ఆటగాళ్ల లోపాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి సందర్భాలు తక్కువగా వస్తాయి. ఒత్తిడితో కూడిన మ్యాచ్ ల్లో ఇవి ఎదురవుతాయి. ప్రస్తుత చర్చ కారణంగా అద్భుతమైన ఈ మ్యాచ్ స్థాయి తగ్గుతుంది. కొత్త బంతి తో బౌలర్లు రాణించారు. పాక్ ఆటగాళ్ల వికెట్లు సాధించారు. కేఎల్ రాహుల్, బాబర్, రిజ్వాన్, రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. పిచ్ నుంచి సరయిన మద్దతు లభించడంతో బౌలర్లు వారిని త్వరగానే అవుట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చెప్పాడు. ఈ మ్యాచ్ ను భారత క్రీడా అభిమానులు మర్చిపోలేక పోవచ్చు. మన హక్కుల కోసం మాట్లాడేటప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని మాట్లాడాలి. అన్నింటికంటే ముఖ్యంగా మన మాటకు విలువ ఉండేలా చూసుకోవాలి.. భవిష్యత్తులో పాకిస్తాన్ టీం జట్టు కూర్పును మెరుగుపరచుకోవాలి.. ఆస్ట్రేలియా వంటి పిచ్చిలపై నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడిస్తే ఫలితాలు ఉంటాయి. ఒకవేళ జట్టు ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఓటములనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.” అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. అయితే సల్మాన్ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ లో ఓ వర్గం ఆటగాళ్లు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. అతడు భారత జట్టుకు అమ్ముడుపోయాడని మండిపడుతున్నారు.