CM Jagan- RGV: రాజకీయాల్లో శత్రువులను ఎలా వేధించాలి..? ఎలా ఏడిపించాలన్నది ఏపీ సీఎం జగన్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు కోడికత్తి సహా అక్రమాస్తుల కేసు.. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంత క్షోభపెట్టారో.. ఇప్పుడు అంతకు నాలుగు రెట్లు టీడీపీ అధినేత చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఒకసారి మీడియా ముఖంగా కూడా చంద్రబాబును ఏడిపించారు కూడా. ఇప్పుడు జగన్ టార్గెట్ మారింది.

జగన్ ప్రస్తుతం తనకు మొండిగా ఎదురు నిలబడి తొడగొడుతున్న పవన్ ను టార్గెట్ చేశాడు. విశాఖలో నిర్బంధించినా.. మంత్రులతో వ్యక్తిగత దాడి చేసినా పవన్ లో స్థైర్యం తగ్గడం లేదు. బూతులకు బూతులతోనే సమాధానమిస్తూ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు. అందుకే పవన్ వెనుకున్న సినీ ఇండస్ట్రీ పెద్దలతోనే ఆయనను దెబ్బకొట్టాలని జగన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను సీఎం జగన్ పిలిపించినట్టు తెలిసింది. ఈరోజు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన రాంగోపాల్ వర్మ.. జగన్ తో రహస్యంగా సమావేశమైనట్టు ప్రచారం సాగుతోంది. పవన్ ను టార్గెట్ చేయడానికే వర్మను ఆయుధంగా జగన్ వాడబోతున్నాడని.. ఈ మేరకు దిశానిర్ధేశం చేశాడని.. రేపటి నుంచి పవన్ పై విరుచుకుపడడానికి రాంగోపాల్ వర్మ రెడీ అవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే పవన్ పై వర్మ వ్యక్తిగత దూషణలకు దిగాడు. నాగబాబుతోనూ పెట్టుకున్నాడు. శ్రీరెడ్డి విషయంలోనూ తలదూర్చి పవన్ ఫ్యామిలీని వర్మ టార్గెట్ చేశాడు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా వర్మ ముద్రపడ్డాడు. ఈక్రమంలోనే పవన్ పై దాడికి వర్మను పావుగా వాడుకోవాలని జగన్ చూస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగతంగా దాడి చేసేందుకు జగన్ ఈ స్కెచ్ గీస్తున్నట్టు తాడేపల్లి సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.