Success: ఆచార్య చాణక్యుడు.. రాజనీతికోవిదుడిగానే కాకుండా ఆర్థికవేత్తగా, దౌత్యవేత్తగా మన్ననలు పొందిన వ్యక్తి. మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుదిక్కులా వ్యాపింపజేసిన అసమాన ప్రతిభ కలిగిన వ్యక్తి ఆచార చాణక్యుడు.
మానవ జీవితానికి సంబంధించి అనేక విషయాలను నీతిశాస్త్రంలో బోధించారన్న విషయం తెలిసిందే. మంచి, చెడుల గురించి వివరిస్తూనే జీవితంలో ఏం చేస్తే విజయాన్ని సాధించగలం..? ఏం చేస్తే ఆనందాన్ని పొందగలం..? వంటి విషయాలను ఆయన వివరించారు. అందులో కొన్నింటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిజాయితీ లేని వ్యక్తి జీవితం పతనం కావడం ఖాయమని ఆచార్య చాణక్యుడు తెలిపారు. నిజాయితీ లేని అతి తక్కువ సమయంలో విజయాన్ని సాధించినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదని చెప్పారు. అటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ లోలోపల కంగారు పడుతూనే ఉంటారన్న చాణక్యుడు నిజాయితీ లేని మనిషికి అదే పెద్ద శిక్ష అని పేర్కొన్నారు. అందుకే నిజాయితీగా ఉండాలని, అలాగే ఎప్పుడూ మనస్సాక్షి చెప్పేది వినాలని సూచించారు.
మనిషికి అతి పెద్ద శత్రువు సోమరితనమని ఆచార్య చాణక్యుడు తెలిపారు. కష్టపడటానికి ఇష్టపడని వ్యక్తి జీవితంలో రాణించలేడని పేర్కొన్నారు. కష్టపడే సామర్థ్యం ఉండి శ్రమపడితేనే ఆ వ్యక్తిని విధిని సైతం మార్చగలడని చెప్పారు. కానీ సోమరితనాన్ని కలిగి ఉంటే మాత్రం వ్యక్తి జీవితం నాశనం అయినట్లేనని వెల్లడించారు.
అలాగే మాటలపై నియంత్రణ.. మాటలను అదుపులో ఉంచుకునే వ్యక్తులు మాత్రమే సమాజంలో గౌరవాన్ని పొందడంతో పాటు సంతోషంగా ఉంటారని చాణక్యుడు తెలిపారు. పనికిరాని విషయాలను ప్రస్తావించే వారు, తప్పుగా మాట్లాడే వారు తరచూ వివాదాల్లో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులు జీవితంలో విజయాన్ని సాధించలేరని వెల్లడించారు. అందుకే విజయవంతమైన జీవితం గడపాలంటే మాటపై నియంత్రణ అనేది చాలా ప్రధానమని ఆచార్య చాణక్యుడు తెలిపారు.
అదేవిధంగా ఇతరులపై ఆధారపడి జీవించే వ్యక్తులు కూడా ఎప్పుడూ విజయాన్ని సాధించలేరని చాణక్యుడు పేర్కొన్నారు. ఇటువంటి వారికి ప్రత్యర్థుల చేతిలో పరాభవం తప్పదని స్పష్టం చేశారు.