https://oktelugu.com/

Dengue Fever: ఇక డెంగీ వచ్చినా బేఫికర్.. ప్రాణాంతకం కాదు.. కీలక ప్రయోగం

అమెరికాలోని జాన్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సహకారంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 23, 2023 10:02 am
    dengue-fever
    Follow us on

    Dengue Fever: ప్రాణాంతకంగా మారుతున్న డెంగీ వైర్‌సకు చెక్‌ పెట్టేందుకు త్వరలోనే మాత్రలు రాబోతున్నాయి. ప్రముఖ ఔషధ దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ వీటిని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఆ మాత్రలు క్లినికల్‌ ట్రయల్‌ దశలో ఉన్నాయని.. వాటి వాడకం ద్వారా మంచి ఫలితాలే వస్తున్నాయని ఆ కంపెనీ తెలిపింది. అమెరికాలోని చికాగో అమెరికన్‌ సోసైటీ ఆఫ్‌ ట్రోఫికల్‌ మెడిసిన్‌ అండ్‌ హైజిన్‌ వార్షిక సమావేశంలో కొత్తగా రూపొందించిన డెంగీ మాత్రపై ప్రజెంటేషన్‌ను ఇచ్చింది. నిజానికి డెంగీ వస్తే లక్షణాలేవి కనిపించవు. ఒక రకంగా దీన్ని బ్రేక్‌బోన్‌ ఫీవర్‌గా వ్యవహరిస్తారు. కొంతమంది రోగుల్లోనే తీవ్రమైన కీళ్లనొప్పులుంటాయి. రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయి పరిస్థితి విషమిస్తుంది. ప్రస్తుతం డెంగీకి ప్రత్యేక వైద్య చికిత్సా విధానమంటూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని దేశాలకు ఇది సవాలుగా మారుతోంది. ప్రతీ ఏటా ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో లక్షల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దోమలు, వాతావరణ మార్పులతో ఇది మరింతగా వ్యాప్తి చెందుతుంటుంది.

    క్లినికల్‌ ట్రయల్స్‌ ఇలా…

    అమెరికాలోని జాన్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సహకారంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా పది మంది వాలంటీర్లకు డెంగీ వైర్‌సను ఇంజెక్టు చేశారు. ఆ వైర్‌సను శరీరంలోకి ప్రవేశపెట్టే ఐదు రోజులు ముందుగానే అభివృద్ధి చేసిన డెంగీ మాత్రను అందించారు. అలా మొత్తం 21 రోజుల పాటు ఆ పిల్‌ను వాడించారు. పది మందిలో ఆరుగురి రక్తంలో డెంగీ వైరస్‌ లక్షణాలేవీ కనిపించలేదు. అంటే డెంగీ వైర్‌సకు ఎక్స్‌పోజ్‌ అయినప్పటికీ వారి రక్తంలో వైరస్‌ నమూనాలు కనిపించలేదు. 85 రోజుల పాటు వారందర్నీ పర్యవేక్షణలోనే ఉంచి ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. తాము అభివృద్ధి చేసిన ఔషధం 2 రకాల వైరల్‌ ప్రోటీన్స్‌ను నిరోధించడమే కాకుండా వైరస్‌ శరీరంలో మరింత వృద్ధి చెందకుండా నియంత్రిస్తుందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ వెల్లడించింది. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో 4 రకాల డెంగీ వైరస్ ల పై ఇది పనిచేయాల్సి ఉందని తెలిపింది. తదుపరి దశలో చికిత్సకు వినియోగించేందుకు ఆ పిల్‌ను పరీక్షిస్తామని పేర్కొంది. ఈ మాత్రలు మంచి ఫలితాలు సాధించి అందుబాటులోకి వస్తే.. దిగువ, మధ్య ఆదాయ దేశాలకెంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది.

    దోమల పై కూడా..

    దోమల వృద్ధిని నిరోధించడానికి ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తున్నది. దోమల వల్ల ఏటా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో దోమల కాటు వల్ల వివిధ రకాల జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ జ్వరాలు ప్రాణాలను హరిస్తున్నాయి. దోమల వృద్ది వల్లే ఇదంతా జరుగుతుందని భావిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ.. వాటి నియంత్రణకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా దోమల డిఎన్ఏ లో వృద్ధిని నిరోధించే జన్యువును ప్రవేశపెట్టి.. అలాంటి దోమలను కృత్రిమంగా అభివృద్ధి చేసి బయటి వాతావరణంలోకి విడుదల చేయాలని భావిస్తోంది. ఈ దోమల మీద ప్రయోగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఆ కంపెనీ మాత్రం చెప్పలేదు.