FiFa Football Final Nora Fatehi : ఖతార్ దేశం… లక్షలాది మంది ప్రేక్షకులు.. ఆమె డాన్స్ వేస్తే కాలు కదిపారు. పాట పాడితే కోరస్ అందించారు. మొత్తానికి ఆమె ఫిఫా ఫైనల్ మ్యాచ్ ను తన డ్యాన్స్ తో హోరెత్తించింది. కోట్లాదిమందిని మైమరపింపజేసింది. ఆమె ఎవరో కాదు ప్రభాస్ బాహుబలి లో మనోహరి పాటలో ప్రభాస్ ను మత్తులో ముంచింది. టెంపర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో రెచ్చిపోయింది.. రవితేజకు కొత్త కిక్ ఇచ్చింది..

-నోరా కు ఫిదా
నోరా పతేహి.. తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. పుట్టింది కెనడా అయినప్పటికీ.. ఆమెకు సినీ రంగానికి సంబంధించి చాలా విభాగాల్లో పట్టు ఉంది. అందమే కుళ్లుకునేంత అందం తనది. పాట పాడుతుంది. దర్శకత్వం వహిస్తుంది.. ఐటెం సాంగ్ లో మెరుస్తుంది.. బాలీవుడ్ కాదు చాలా సినిమా పరిశ్రమల్లో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆ క్రేజ్ గుర్తించే ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప నటీమణులు ఉన్నప్పటికీ ఫిఫా ఏరి కోరి ఆమెకు అవకాశం ఇచ్చింది. అంతేకాదు ఫుట్ బాల్ థీమ్ సాంగ్ కు ఆమెతో డ్యాన్స్ చేయించింది. ఆమె డ్యాన్స్ దెబ్బకు స్టేడియం మొత్తం ఊగిపోయింది. నోరా నోరా అంటూ… అభిమానులు ఆమెను ప్రేమగా పిలిచారు. ఈలలు వేస్తూ గోలలు చేశారు. ఈ డ్యాన్స్ చూస్తున్న అర్జెంటీనా, ఫ్రాన్స్ క్రీడాకారులు ఫిదా అయిపోయారు..
మల్టీ టాలెంటెడ్
నోరా పతేహి బాలీవుడ్ లోనూ ఐటమ్ సాంగ్ లకు డ్యాన్స్ చేసింది.. 2014లో బాలీవుడ్ చిత్రం “రోర్” లో ద్వారా భారతీయ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తర్వాత ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోనా అనే పాటకు డ్యాన్స్ చేసి, ఊపు ఊపింది. బాలీవుడ్లో అతిపెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ లో తనదైన ముద్ర వేసింది. సీజన్ 9 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అందులోకి ప్రవేశించి 84వ రోజు బయటకు వచ్చింది.. జలక్ దిఖలాజా సీజన్ 9లో పాల్గొన్నది. అంతేకాదు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటకు డ్యాన్స్ వేసింది.. ఆ తర్వాత కిక్ 2లో కిరుకు కిక్ పాటలో రవితేజతో ఆడి పాడింది..లోఫర్ లో నొక్కేయ్, దోచేయ్, ఊపిరిలో డోర్ నంబర్ అనే పాటల్లో తన డ్యాన్సులతో ప్రేక్షకులను మైమరిపింపజేసింది.
నోరా కు భలే క్రేజ్
నోరా కు బాలీవుడ్ లో క్రేజ్ బాగా ఉంటుంది. ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉంటాయి. సత్యమేవ జయతే సినిమాలో దిల్ బర్,స్త్రీ సినిమాలో కామరియా, సత్యమేవ జయతే 2 లో కుసు కుసు, యాన్ యాక్షన్ హీరో, జాదా నషా వంటి పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఇక్కడితోనే ఆమె ఆగలేదు 10 కి పైగా మ్యూజిక్ వీడియోల్లో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించింది.. నటిగానూ నోరా తలుక్కున మెరిసింది. భారత్, బాట్ల హౌస్, స్ట్రీట్ డాన్సర్ త్రీ డి, భుజ్, థ్యాంక్ ఇండియా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక స్టార్ వర్సెస్ ఫుడ్ సీజన్ 2, మూవింగ్ మలైక వంటి వెబ్ సిరీస్ లోనూ నోరా నటించింది. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే ఫిఫా ఆమెకు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్లో ఆమె డాన్స్ చేస్తే మైదానం మొత్తం దద్దరిల్లిపోయింది.