Eldest Daughter Syndrome: మహా అయితే తమ్ముడు కంటే రెండు సంవత్సరాలు ముందు, చెల్లెలి కంటే మూడు సంవత్సరాలు ముందు పుట్టి ఉంటుంది. ఆ మాత్రం దానికి ఇంట్లో వాళ్ళ నుంచి ఆడపిల్లపై చీత్కారాలు ఎదురవుతాయి..” తమ్ముడు చూడు ఎలా ఏడుస్తున్నాడు. చెల్లెలు చూడు ఎలా ఇబ్బంది పడుతుందో? పెద్ద దానివి కదా ఆ మాత్రం చూసుకోలేవా? పెద్ద దానివి కదా నీకు కూడా చెప్పాలా”? ఇలా ఉంటాయి ముందు పుట్టిన ఆడపిల్లలపై ఇంట్లో వేధింపులు. మహా అయితే ఆ అమ్మాయి ఐదో లేదా ఆరు సంవత్సరాలు ఉంటుంది.. ఆ మాత్రం దానికి ఇంట్లో వాళ్ళు సాధింపులు, వేధింపులు మొదలుపెడతారు. కన్నవాళ్ళు, ఇంట్లో పెద్దలు అలా అనేసరికి ఆ చిన్నారి మనసు గాయపడుతుంది. ఆత్మ న్యూనతకు గురవుతుంది.” నువ్వు పెద్ద దానివి. జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చూసి తమ్ముడు లేదా చెల్లె నేర్చుకుంటారు” ఇలాంటి మాటలు చిన్నారుల మనుషుల్లో అంతులేని వేదనను పెంచుతాయి.
పెద్దగా పుట్టడమే తప్పా?
పెద్ద కూతురుగా పుడితే చాలు.. తన తర్వాత పుట్టిన వారికి ఆ అమ్మాయి స్ఫూర్తిదాయకంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మొదటి సంతానంగా పుట్టినంత మాత్రాన చిరు వయసులోనే వాళ్ళు పెద్దవారిలా వ్యవహరించలేరని అమ్మానాన్నలు గ్రహించకపోవడమే ఇందుకు కారణం. రెండవ సంతానం కలగగానే ముందు పుట్టిన వాళ్లకి ఈ విషయంలో ఆడపిల్లలకి పెద్దరికం ఆపాదిస్తారు. చిన్నపిల్లల ఆలన పాలన వారికి అప్పగిస్తారు. లేని పెద్దరికాన్ని కట్టబెడతారు.” నేను ఎప్పుడు చదువుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి? ఆస్తమానం తమ్ముడు లేదా చెల్లెలితోనే సరిపోతుంది ఇలా అయితే ఎలా” అనే ప్రశ్న ముందు పుట్టిన ఆడపిల్ల వేస్తే..” నువ్వు పెద్ద పిల్లవి. తమ్ముడు లేదా చెల్లెలి కోసం ఆ మాత్రం చేయలేవా” అనే సమాధానం తల్లిదండ్రులనుంచి వస్తుంది.
సరదాలు కోల్పోతున్నారు
ముందు పుట్టిన ఆడపిల్లల మీద తల్లిదండ్రులు లేని పెద్దరికాన్ని ఆపాదించడం ద్వారా వారు సరదాలను కోల్పోతున్నారు. మానసిక వేదనకు గురవుతారు. తమ్ముడు లేదా చెల్లెలు ఆడుకునే ఆట బొమ్మలు చూసి “నాకు కూడా అలాంటివే కావాలని” తల్లిదండ్రులని అడిగితే “నీకెందుకు బొమ్మలు? పెద్దదానివి?” అనే సమాధానం వస్తుంది.. ఇలాంటి సమాధానాలు పిల్లలను అంతులేని క్షోభకు గురిచేస్తాయి. నేనూ చిన్నదానినే అని ఆ తల్లిదండ్రులకు చెప్పాలనిపించినా చెప్పలేకపోవడం, అదనపు బరువు బాధిత మోయలేకపోవడం.. ఆ పిల్లల్ని మరింత వేదనకు గురిచేస్తాయి.
ఎల్డెస్ట్ డాటర్ సిండ్రోమ్
పిల్లలు మానసిక వేదనతో బాధపడే వ్యాధిని వైద్య పరిభాషలో ” ఎల్డెస్ట్ డాటర్ సిండ్రోమ్” అని పిలుస్తారు. ఒక సంస్థ నివేదిక ప్రకారం ఐదు నుంచి 14 సంవత్సరాల ఆడపిల్లల్లో 40 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. దీనివల్ల వారు ఇతరులతో కలవలేరు. చలాకీగా ఉండలేరు. ముభావంగా ఉంటారు. ఒంటరితనాన్ని బాగా ఇష్టపడతారు. ప్రతికూల మానసత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు తనకు దక్కని ప్రేమ తన తర్వాత పుట్టిన వారు పొందుతుండడంతో వీరిలో అసూయ, ద్వేష పెరుగుతాయి. అచ్చం జై లవకుశ, హరే రామ్ సినిమాలో చూపించినట్టే పిల్లల్లో మానసిక పరిస్థితి ఉంటుంది. ఇలాంటి క్రమంలో వారు ఏదైనా అఘయిత్యాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది.
ఇదిగో పరిష్కారం
ఇలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేనిపోని పెద్దరికాన్ని ఆపాదించకూడదు. నలుగురిలో చులకన చేసేలాగా మాట్లాడకూడదు. ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడాలి. వారు ఏది అడిగితే అది కొని పెట్టాలి. కొని పెట్టలేని పరిస్థితిలో తమ ఆర్థిక స్థితి గురించి అర్థం అయ్యేలా వివరించాలి. వారిని ఒంటరిగా వదిలిపెట్టకుండా స్వేచ్ఛగా మాట్లాడాలి.