Dhan Prapti: మనదేశంలో వాస్తు శాస్త్రానికి విలువ ఉంది. మనం ఇల్లు కట్టుకోవాలన్నా కొనాలన్నా వాస్తు చూసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు వస్తాయని భావిస్తుంటారు. ఇందులో భాగంగా చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటిస్తే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా వాస్తుదే ప్రధాన పాత్ర అని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటిస్తేనే మనకు లాభం కలుగుతుంది. ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని వస్తువులను కూడా అమర్చుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

ఇంట్లో విరిగిపోయిన, పాడైపోయిన వస్తువులను బయట పడేయాలి. ఇంట్లో ఉంచుకుంటే చెడు ఫలితాలే ఎదురవుతాయి. కొన్ని పనులు కొన్ని రోజుల్లో చేస్తేనే మంచి శకునాలు వస్తాయి. శనివారం రోజు బూజు దులపడం, ఇల్లు శుభ్రం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉదయం లేస్తూనే మనం చూసే వస్తువు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే శుభం కలుగుతుందని భావిస్తుంటారు.
మీ పర్సులో డబ్బులు అయిపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరుపు రంగు పర్సు వాడితే కాస్త ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు. అవసరానికి మించి డబ్బు రావడం లేదని భావిస్తే కులదైవానికి మొక్కులు చెల్లించుకోవాలి. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోతే కనీసం పదిశాతం దానధర్మాలకు వెచ్చిస్తే ఫలితం ఉంటుంది. డబ్బుకు ఇబ్బందిగా అనిపిస్తే చిన్న పిల్లలకు స్వీట్లు పంచితే నష్టం కలగదు. పూజా గదిలో కొబ్బరి కాయ కొట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ధనప్రాప్తి కోసం అమ్మవారి వద్ద లవంగం ఉంచి ప్రార్థిస్తే మంచిది. ఆడవారు ఇంట్లో ఏడవడం మంచిది కాదని తెలుసుకోవాలి. ప్రతి రోజు పూజలో శ్రీసూక్తం చదువుకోవాలి. డబ్బులు దాచుకునే చోట అక్షింతలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు ఆకుపచ్చ గాజులు, నాలుగు శ్రీ ఫలాలు, శ్రీ సూక్తం పెడితే మనకు ఎన్నో విధాలా ప్రయోజనం కలగడం సహజం. రెండు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రం దగ్గర ఉంచుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. పొదుపు చేయాలనుకుంటే భరణి నక్షత్రం ఉన్నప్పుడు పొదుపు చేస్తే కలిసి వస్తుందని డబ్బు ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.