Sleep Tips: మనకు తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే. ప్రతి జీవి నిద్ర లేనిదే ఉండలేదు. ఏదో ఒక సమయంలో కన్ను ఆర్పనిదే తన మనుగడ సాగించలేదు. అలా నిద్ర మన జీవితంలో ఒక భాగమే. మనం బతికే కాలంలో సగం నిద్రకే పోతుందనే విషయం చాలా మందికి తెలియదు. జీవితంలో సరైన తిండి నిద్ర లేకపోతే జీవనం కష్టమే. అందుకే నిద్రకు అంతటి ప్రాధాన్యం ఇస్తున్నాం. మరి మనకు సుఖమైన నిద్ర రావాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుంటే మంచిది. నిద్ర మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

నిద్ర పోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. లేకపోతే కంటి నిండా నిద్ర పట్టదు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మంచి నిద్ర పట్టాలంటే రాత్రి పూట వ్యాయామం చేయకూడదు. అలా చేస్తే శరీరం ఉత్తేజిమై నిద్ర రాకుండా పోతుంది. దీంతో కంటి మీద కునుకు రాదు. రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయకూడదు. అలా చేస్తే మనకు నిద్ర దరిచేరదు. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికే ఎక్కువ సమయం పట్టడంతో నిద్ర పట్టదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీని వల్లనిద్రకు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది.
సాయంత్రం ఏడు గంటల లోపు భోజనం ముగించాలి. భోజనం అయ్యాక కనీసం ఓమూడు గంటలు విశ్రాంతి ఇస్తే కడుపు ఖాళీ అవుతుంది. తొందరగా నిద్ర వచ్చే అవకాశముంటుంది. ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నా తొందరగా జీర్ణం కాదు. తేలికైన ఆహారం తీసుకుంటేనే మంచిది. రాత్రి సమయంలో పళ్లు శుభ్రం చేసుకుంటే దంతాల మధ్య పాచి పేరుకుపోకుండా ఉంటుంది. నోరు అపరిశుభ్రంగా ఉంటే కూడా నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి అల్కాహాల్ తీసుకోవడం వల్ల మత్తుగా అనిపిస్తుంది కానీ ప్రశాంతమైన నిద్ర పట్టదు. మద్యానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

నిద్ర పోవడానికి 6-8 గంటల ముందు టీ, కాఫీలు లాంటివి తాగకూడదు. ఒకవేళ తాగితే అందులో ఉండే కెఫిన్ వల్ల నిద్ర రాకుండా చేస్తుంది. అందుకే వీలైనంత వరకు టీ, కాఫీలు తగ్గిస్తేనే మేలు. రాత్రి వేళ టీ, కాఫీలు తాగితే నిద్రకు భంగం కలగడం ఖాయం. నిద్ర పోయే ముందు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ర్టానిక్ వస్తువులను దూరంగా ఉంచాలి. వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదు. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పడక గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. లైటు ఉంటే దాని కాంతితో మెదడుపై ప్రభావం పడుతుంది. దీంతో నిద్ర రావడానికి అవరోధాలు ఏర్పడతాయి.