
Women Nighties: మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది. మన దేశంలో ఉన్న సంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు. ఇక్కడి పద్ధతుల్ని అవలంభించడానికి ఇష్టపడుతుంటారు. కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం. వారి వేషధారణను అనుకరిస్తున్నాం. ఫలితంగా మన ఆచార వ్యవహారాలకు పాతరేస్తున్నాం. దీంతో మన సంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం. ఈ నేపథ్యంలో మన దేశ సంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరు ఆశ్చర్యపోతున్నారు.
పూర్వం రోజుల్లో..
పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునే వారు. ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్లినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్లినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సంప్రదాయం ఎక్కడిది? మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరు విధిగా పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ అసహ్యంగా కనిపిస్తున్నారు.

నైటీ అంటే..
పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైటు వేసుకుని పొద్దున్నే తీసేసేది. కానీ మన వారు ఫ్యాషన్ గా దాన్ని పొద్దంతా శరీరం మీదే ఉంచుకుంటున్నారు. ఏదో రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేస్తే ఫర్వాలేదు. దాని మీద తిరుగుతున్నారు. బజారుకు కూడా వెళ్తున్నారు. ఇదెక్కడి చొద్యం రా బాబూ అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పాడు సంప్రదాయంతో అందరి మతులు పోతున్నాయి. చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు. సాక్షాత్తు మహాలక్ష్మీ దేవిలా కనిపిస్తారు. అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు.
చీర కట్టులో..
చీర కట్టు మన సంప్రదాయం. ఎంత అందంగా ఉంటుంది. చూడ్డానికి ఎంత లక్షణంగా ఉంటుంది. చీర కట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే. అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది. అలాంటి నైటీలు వేసుకుని మన ఆచారాలకు కళంకం తెస్తున్నారు. ముద్దులొలికే చీరలు ఉండగా నైటీలెందుకు దండగ. కాని ఏం చేస్తాం వేలం వెర్రి ఒకరిని చూసి మరొకరు తమ వస్త్రధారణలో నైటీలు వేసుకుంటూ మహిళా మణుల గౌరవం చెడగొడుతున్నారు.
మారదా ఈ సంస్కృతి
నైటీలు వేసుకునే పద్ధతులు ఇక మారవా? అని అందరు ఆలోచిస్తున్నారు. కట్టు బొట్టు ఎంతో హుందాగా ఉండే చీరలను వదిలేసి నైటీలేసుకోవడం ఏమిటి? చోద్యం కాకపోతే నైటీలు వేసుకుంటే ఏం బాగుంటుంది. స్త్రీ మూర్తిలా కనిపించాలంటే చీర కట్టుకుంటేనే కరెక్టు. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకుని పొద్దున తీసేయండి. నైటీ వేసుకుని వంట చేయడం మంచిది కాదు. పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. అందుకే నైటీని వదిలేయండి. చక్కగా చీర కట్టుకుని మహిళలకు దక్కే గౌరవాన్ని దక్కేలా చేయండి.