Husband And Wife: ‘ఒంటరి ప్రయాణం రిస్క్ ఉండదు.. కానీ సంతోషంగా ఉండు.. జంట ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులుంటాయి.. కానీ ఆనందంగా ఉంటుంది..’ పెళ్లైన కొత్తలో ఓ నటి చెప్పే డైలాగ్ ఉంది. ఇది సినిమాలోని డైలాగ్ అయినా నిజజీవితంలో అక్షరాల నిజం. పెళ్లిచేసుకుంటే జీవితం నాశనం అంటారు చాలా మంది. కానీ వివాహ జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా ఉంటుంది. అయితే ఆ వివాహ బంధాన్ని సంతోషకరంగా ఉంచుకోవాలంటే ఓర్పు, సహనం ఉండాలి. ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరు అణిగిమణిగా ఉండాలి. అప్పుడే సంసార సాగరాన్ని ఈదుతాం..
ప్రతీ వ్యక్తి మనస్తత్వం పెళ్లికి ముందు ఒకలాగా.. పెళ్లయిన తరువాత మరోలా ఉందని కొందరు చెబుతూ ఉంటారు. ఇది సహజం. ఎందుకంటే సంసారంలో ఏర్పడి పరిస్థితుల కారణంగా వారి మనస్తత్వాలు మారిపోవచ్చు. అయితే అన్యోన్యమైన దంపతుల మధ్య ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకొని తమ జీవితాన్ని సుఖవంతంగా చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. మిగతా వారు మాత్రం అలా ఉండరు. భార్యపై భర్త.. భర్తపై భార్య పెత్తనం చెలాయించాలని అనుకుంటారు. ఇద్దరి మధ్య చిన్న ఇగో వల్ల పెద్ద పెద్ద సమస్యలను కొని తెచ్చుకుంటారు.
సంసారంలో భార్యభర్తలు ఇద్దరూ సమానమే.. ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువ అని అంచనా వేయలేం. అయితే సంసార బాధ్యత విషయంలో భర్తదే పైచేయి ఉంటుంది. భార్యతో సహా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కాపాడే బాధ్యత ఆయనపై ఉంటుంది. ఈ తరుణంలో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. అయితే దీనిని ఆసరగా తీసుకొని కొందరు భార్యలు భర్తలపై విరుచుకుపడుతూ ఉంటారు. భర్త చేసే పొరపాట్లను ఎత్తి చూపుతూ వారిపై పెత్తనం చెలాయించాలని అనుకుంటారు. ఇలా చేయడం వల్ల భర్తతో పాటు భార్య కూడా నష్టపోతుంటుంది. అయితే ఇవన్నీ ఇంటిలోపల జరిగితే ఎలాంటి సమస్యలు ఉండవు.కానీ బయటకు వెళితే పెద్దదిగా మారుతుంది. ..
భర్త ఒకవేళ తప్పు చేస్తే ఆ విషయాన్ని భార్య అడగాలి. అంతేగానీ ఆ విషయాన్ని భార్య పుట్టింట్లో చెబితే ఆ సమస్య పెద్దదవుతుంది. అంతేకాకుండా ఆయనపై మెట్టినింట్లో చెడు ప్రభావం ఏర్పడుతుంది. దీనివల్ల భర్త అత్తారింటికి వెళ్లిన సమయంలో గౌరవం తగ్గి ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు వస్తాయి. చివరగా నష్టపోయిది తన భర్తే అని ఆ భార్య గుర్తించాలి అని అంటున్నారు. భర్త లోపాన్ని ఎప్పుడూ ఇంటిపక్కల వాళ్లకు చెప్పకూడదు. ఎందుకంటే వారి దృష్టిలో చిన్నచూపు ఏర్పడుతుంది. ఫలితంగా కొన్నిసార్లు ఇంటిపక్కన వాల్లు హేళన చేసే అవకాశం ఉంది. దీంతో అతను మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా పిల్లల ఎదుట భర్తను తిట్టకూడదు. పిల్లల దృష్టిలో తండ్రి చులకనగా మారుతాడు. దీంతో రాను రాను ఆ ప్రభావం వారిపై పడి నష్టం జరుగుతుంది.
అయితే భార్య చెప్పినా భర్త వినకపోతే అతనికి దగ్గరగా ఉన్నవాళ్లతో చెప్పించాలి. అయినా వినకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్లకు చెప్పాలి. అయితే చిన్న చిన్న విషయాల్లో మాత్రం భార్య తమ పుట్టినింటికి చెబితే సమస్యలు ఎదురువుతాయి. ఈ విషయంలో ఆడవాళ్లు చాకచక్యంగా వ్యవహించి తమ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.