Intelligent People: “అడిగినదానికి సమాధానం చెప్తే తెలివితేటలంటారు. చెప్పకపోతే బలుపు అంటారు.. మరి నన్నేం చేయమంటారు” చదువుతుంటే అతడు సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తోంది కదా.. తెలివైనవాడు ఎలా ఉంటాడో.. రెండు ముక్కల్లో సమాధానం ఎలా చెబుతాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మాటల ద్వారా తనికెళ్ల భరణితో చెప్పించాడు. నిజానికి తెలివైనవారు ఎలా ఉంటారు? సినిమాల్లో చూపించినట్టుగా నిశ్శబ్దంగా, ఎవరితో మాట్లాడకుండా, మౌన మునిలాగా ఉంటారా , లేక ప్రత్యేక లక్షణాలు ఏమైనా చూపిస్తారా? తాజా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే..
తెలివైన వారు తమ తెలివితేటల గురించి పదిమందిలో ఎక్కువగా చెప్పుకోరు. తమకు తెలియని విషయాల మీద తీవ్రంగా మదనం సాగిస్తారు. నిరంతర అధ్యయనం మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. తమ ఆలోచన పరిధిని పెంచుకునేందుకు, కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
తెలివైన వ్యక్తులు ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తారు. ఇతరులు ఏవైనా విషయాలను తెలుసుకుంటే వాటిని ప్రత్యేక దృష్టితో చూస్తారు.. అంతేకాదు మరింత ప్రయోజనకరమైన ఫలితాల కోసం సరికొత్త ప్రయత్నాలు సాగిస్తారు..
తెలివైన వారు సమస్యలను ఎదుర్కోవడంలో.. సవాళ్లను పరిష్కరించడంలో ముందుంటారు.. నిరాశ, నిస్పృహలను వారి దగ్గరికి కూడా రానివ్వరు. పట్టుదల, నిరంతర ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచన ధోరణి పెంపొందించుకుంటారు.
తెలివిగలవారికి ఎంత తెలిసినా తెలియనట్టే ఉంటారని ప్రఖ్యాత తత్వ శాస్త్రవేత్త అరిస్టాటిల్ ఎప్పుడో చెప్పారు. తమకు ఎంత తెలిసినప్పటికీ తెలియని వారి లాగానే ఉంటారు. తెలుసుకోవాలని జిజ్ఞాస వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే విషయ పరిజ్ఞానం వారికి త్వరగా అలవడుతుంది.
తెలివైన వారికి వివరాలు తెలుసుకోవడంలో ఉండే ఉత్సుకత.. వాటిని జూమ్ చేసి చూసే విధానం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి అంశం లో ఎవరూ చూడని కోణాన్ని వారు స్పృశిస్తారు. విభిన్నతత్వంతో విషయాలను ఆకళింపు చేసుకుంటారు.
తెలివైన వారు నిశ్శబ్దంగా ఉండరు. తెలిసిన విషయానికి సంబంధించి లోతైన పరిశీలన చేస్తూనే.. తెలియని విషయానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతుంటారు. విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి సరికొత్త విషయాలను సంగ్రహిస్తారు
తెలివైన వ్యక్తులు విషయాలను అర్థం చేసుకోవడంలో.. అవి ఎందుకు ఉపకరిస్తాయి? చేసే పనిలో దాని పరిధి ఎంత? సంక్లిష్టతలు ఏమైనా ఉంటాయా? అనే విషయాలను నిశితంగా పరిశీలిస్తారు.
తెలివైన వారు ఇతరుల పట్ల గౌరవంతో ఉంటారు. వారు చెప్పే మాటలను మనస్ఫూర్తిగా వింటారు.. విషయం మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోరు. దృష్టి మళ్లించే ప్రయత్నం అస్సలు చేయరు.