Using mobile in dark: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ లేకుండా ఉండడం చాలా కష్టతరంగా మారింది. ప్రతి సమస్య పరిష్కారానికి.. ప్రతి సమాచారం తెలుసుకోవడానికి.. ప్రతి రూపాయి పంపడానికి ఫోన్ తప్పనిసరిగా మారింది. అయితే ఈ ఫోన్ మితిమీరడంతో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మొబైల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనిని సరైన విధంగా ఉపయోగించుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అవసరం ఉంటే తప్ప అనవసరపు విషయాలకు మొబైల్ వాడొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ చాలామంది రాత్రి సమయంలో.. అదికూడా చీకటి గదిలో మొబైల్ చూస్తూ ఉంటున్నారు. ఇలా చీకటి గదిలో మొబైల్ చూడడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో తెలుసా?
సాధారణంగానే మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల మానసిక సమస్యలు ఉంటాయి. అందులోనూ చీకటి గదిలో మొబైల్ చూసే ప్రయత్నం చేస్తే కళ్ళపై తీవ్ర ప్రభావం పడుతుంది. చీకటిలో స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది. దీంతో కళ్ళలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత కళ్ళు బరువుగా అనిపించడం.. కంటి నొప్పి రావడం.. కళ్ళు ఎర్రబడడం వంటివి అవుతాయి. అలాగే చీకటి గదిలో మొబైల్ చూడడం వల్ల కంటికి తాత్కాలిక దృష్టి బ్లర్ ఏర్పడుతుంది. అంటే ఒక్కోసారి దృష్టి మసక పారిపోయినట్లు అవుతుంది. దూరపు వస్తువులు చూడడానికి ఇబ్బందిగా మారుతుంది. ఎక్కువగా చీకటి గదిలో మొబైల్ చూడడం వల్ల కంటిపై పడే ఐ బ్లూ లైట్ కంటికి తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తుంది. ఆ తర్వాత తలనొప్పి, మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నిద్రలేమి, నిద్ర నాణ్యత చెడిపోవడానికి కూడా ఈ అలవాటే కారణం అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అందువల్ల సాధ్యమైనంత వరకు చీకటి గదిలో మొబైల్ చూసే ప్రయత్నం చేయవద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో అంటే మొబైల్ చూడాల్సివస్తే గదిలో చిన్న లైటు వేసుకోవాలి. అలాగే మొబైల్ చూస్తున్నప్పుడు స్క్రీన్ శాతాన్ని తగ్గిస్తూ.. అవసరం అనుకుంటే పెంచుతూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. అలాగే నిద్ర పోయేముందు గంట ముందు ఫోన్ ఉపయోగించడం తగ్గించాలి. మొబైల్ లో ఉండే నైట్ మోడ్.. బ్లూ లైట్ ఫిల్టర్ ఉపయోగించి ఫోను వాడుకోవచ్చు.
అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది తాత్కాలికమే అని అంటున్నారు. సాధ్యమైనంతవరకు ముఖ్యమైన పనులు ఉదయమే చేసుకోవాలని.. రాత్రి సమయంలో ఫోన్ కు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. అదే పనిగా చీకటి లో మొబైల్ చూడడం వల్ల కంట్లో తీవ్రమైన సమస్యలు వచ్చి చూపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రి సమయంలో మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల వారి చదువుకు అనేక ఆటంకాలు ఉంటాయి.