IndiGo crisis దేశం మొత్తం ఇప్పుడు ఇండిగో విమాన సంక్షోభం పై మాట్లాడుతోంది. అయితే అది ఓ ప్రైవేటు విమానయాన సంస్థ. తమ సంస్థలో వచ్చిన సంక్షోభాన్ని బయట పెట్టకుండా దాచి పెట్టింది. దాని ప్రభావం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి వేళ్ళు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పై చూపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే చిన్న వయసులో కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన రామ్మోహన్ నాయుడు తనకు ఎదురైన పరిణామాలను గట్టిగానే ఎదుర్కొంటున్నారు. సానుకూల దృక్పథంతో మాట్లాడుతున్నారు. సమస్యకు పరిష్కార మార్గం అన్వేషించారు. అయితే తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రిని అని గుర్తించుకొని మాట్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక ప్రైవేటు విమానయాన సంస్థ గుత్తాధిపత్యం మూలంగానే ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఆ సమస్యను అలా చూడడం లేదు. రాజకీయంగా మార్చి రామ్మోహన్ నాయుడు ను టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసిపి నుంచి ఆ స్థాయిలో ఆయనపై విమర్శలు రాలేదు కానీ.. వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ కు ఇదో వరంగా మారింది.
* పట్టు వదలని విక్రమార్కుడిగా..
దువ్వాడ శ్రీనివాస్ కింజరాపు కుటుంబం పై పోటీ చేస్తూనే ఉన్నారు. కింజరాపు ఎర్రంనాయుడు పై చేశారు. ఆయన సోదరుడు అచ్చెనాయుడు పై చేశారు. కుమారుడు రామ్మోహన్ నాయుడు పై చేశారు. ఇలా ప్రయత్నం చేసి ఓటమి పాలయ్యారే తప్ప ఒక్కనాడు కూడా గెలిచిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కింజరాపు కుటుంబానికి కాలు దిగుతారని తెలిసి దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టే కింజరాపు స్వగ్రామానికి వెళ్లి తొడగొట్టి వచ్చారు. కానీ వారిని పడగొట్టలేకపోయారు. ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. చివరకు కుటుంబ వివాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అది మొదలు ధర్మాన ఫ్యామిలీ పై విరుచుకుపడుతూ వచ్చారు. ఇంకోవైపు కింజరాపు కుటుంబం పై కూడా తన అక్కసు వెళ్ళగకుతూ వచ్చారు.
* నేరుగా కేంద్రమంత్రి పై విమర్శలు..
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పై ఇండిగో సంక్షోభం అడ్డం పెట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇండిగో విమానయాన సంస్థ నుంచి ప్రతినెల కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో రామ్మోహన్ నాయుడు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు దువ్వాడ. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్తో పాటు జాతీయ విపక్షాలు కేవలం సంక్షోభాన్ని గుర్తించలేక పోవడాన్ని తప్పుపడుతున్నాయి. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం కోట్ల రూపాయల కమీషన్లు అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే చెల్లని కాసు దువ్వాడ వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అంతలా కామెడీ పీస్ అయ్యారు దువ్వాడ. ఒకసారి ధర్మానతో పాటు కింజరాపు ఫ్యామిలీలను రాజకీయంగా అణచి వేస్తానని చెబుతున్నారు. తన అభ్యర్థులు ఉంటారని హెచ్చరిస్తున్నారు. జాతీయ పార్టీలతో పాటు బలమైన ప్రాంతీయ పార్టీల నుంచి దిగిన దువ్వాడ శ్రీనివాస్ కే ఛాన్స్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు విమాన సంక్షోభం పై పెద్దపెద్ద మాటలు చెబుతున్న దువ్వాడ శ్రీనివాస్ పై స్పందించేందుకు సామాన్య టీడీపీ కార్యకర్త సైతం ముందుకు రావడం లేదు.