Chanakya Niti: సాధారణంగా పిల్లలు ఏ విషయాన్ని అయినా తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. మాట్లాడే మాటల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ పిల్లలు తల్లిదండ్రులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు.
ఆచార్య చాణుక్యుడు పండితుడు మాత్రమే కాక రాజకీయవేత్త, దౌత్యవేత్త అనే సంగతి తెలిసిందే. చాణుక్యుడు నీతి శాస్త్రం ద్వారా మనిషి జీవించాల్సిన పద్ధతి గురించి పేర్కొన్నారు. నీతి శాస్త్రం ద్వారా మనుషుల మధ్య బంధాలు, ఆ బంధాలను నిలబెట్టుకోవడానికి అవసరమైన నడవడిక గురించి కీలక విషయాలను వెల్లడించారు.
తల్లిదండ్రులు పిల్లల ముందు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి చాణుక్యుడు నీతి శాస్త్రంలో సూచనలు చేశారు. పిల్లల ముందు భర్త భార్యను అవమానించకూడదు. భార్య కూడా భర్తను అవమానించేలా మాట్లాడకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోని పక్షంలో పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు ఎల్లప్పుడూ బంధాలను గౌరవించాలి.
పిల్లల ముందు తల్లిదండ్రులు తప్పు పదాలను వాడకూడదు. పెద్దలు తప్పు పదాలను మాట్లాడితే పిల్లలు కూడా అలాంటి పదాలను మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. పిల్లల ముందు తల్లిదండ్రుల ప్రవర్తన ఎల్లప్పుడూ హుందాగా ఉండాలి. పిల్లలకు తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలిసే విధంగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటే మంచిది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అవసరాల నిమిత్తం అబద్ధాలు చెబుతూ ఉంటారు.
తల్లిదండ్రులు ఇతరులకు అబద్ధాలు చెబుతున్నారని తెలిస్తే పిల్లలు కూడా అబద్ధాలు చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు అబద్ధాలు ఆడకుండా ఉండటం ద్వారా పిల్లలను అబద్ధాలు ఆడకుండా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు క్రమశిక్షణా రాహిత్యం ప్రదర్శించకూడదు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో మెలిగితే పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు.