Health Tips: ఆధునిక కాలంలో మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. ప్రస్తుతం అందరు కూర్చుండి చేసే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వేళ్లాడించే పనులే చేస్తున్నారు. దీంతో గంటల తరబడి సీట్లో కూర్చోవడంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, గుండె జబ్బుల వంటివి రావడానికి కారణాలవుతున్నాయి. మనం చేసే పనులే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. పూర్వం రోజుల్లో ఉదయం వెళ్లారంటే సాయంత్రం వరకు ఒకటే పని చేయడం సాయంత్రం వచ్చి అలసిపోయి నిద్ర పోవడం చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. ఎవరు కూడా కష్టం చేయడం లేదు. అందరు కంప్యూటర్ల మీదే కాలం వెళ్లదీస్తున్నారు.

ఫలితంగా ఊబకాయులుగా మారుతున్నారు. అనేక రోగాలకు అడ్రస్ గా అవుతున్నారు. చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం మంచిది కాదు. వీలున్నప్పుడల్లా లేచి నాలుగు అడుగులు వేస్తే శ్రేయస్కరం. పొద్దున నుంచి సాయంత్రం వరకు కుర్చీలో కూర్చునే వారికి అనారోగ్య సమస్యలు రావడం సహజమే. అందుకే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అరగంటకోసారి లేచి నడవాలి. టీవీ రిమోట్, సెల్ కాస్త దూరంగా పెట్టుకుని వాటి కోసమైనా సీట్లో నుంచి లేచేందుకు ప్రయత్నించాలి.
పని మీద పడితే ఇక సమయం చూసుకోకుండా చేయడం సరికాదు. మనం పని చేసే సమయంలో ఎంత సేపు కూర్చుంటున్నాం. ఎన్ని సార్లు లేవాలనే విషయంపై కచ్చితమైన కాల నిర్ణయ పట్టిక లాంటిది పెట్టుకుని అరగంట తరువాత లేచి కొంచెం నడవడానికి ప్రయత్నించాలి. లేదంటే మనకు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. ఉదయం పూట గంట వాకింగ్ చేస్తున్నాను కదా నాకు ఏం కాదు అనుకోవద్దు. దేని దారి దాందే. వాకింగ్ చేసినా సరే ప్రతి అరగంటకోసారి లేచి నడిస్తేనే మన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. లేదంటే అంతే సంగతి.

ఫోన్ వచ్చినప్పుడు నడుస్తూ మాట్లాడాలి. మీటింగ్ సమయంలో వీలైతే నిలబడి ఉండండి. కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు నేలకు ఆనేలా చూసుకోండి. ముందుకు వంగి కూర్చోవద్దు. చిన్న విషయాలకే స్పందించడం, ఒత్తిడి, ఆందోళన వంటివి లేకుండా చూసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా లేచి నిలబడి కాస్త అటు ఇటు తిరగడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఆరోగ్య శ్రేయోభిలాషులుగా మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి మరి.