Devotional Tips: హైదరాబాద్ : హైందవమతం ప్రకారం ఇంటి గడపను సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఈ ద్వారలక్ష్మికి హైందవధర్మంలో ఒక ప్రత్యేక స్థానం వుంది. అందుకే, ఆమెకు ఇష్టమైన పసుపు రాసి కుంకుమ పెట్టి పూజించడం ఆచారంగా మైంది. గడపకు పూజ చేయడం వల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఇంట్లో ఏవైనా దోషాలున్నా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. సింహద్వారం నుంచి ఇంట్లోకి వచ్చే వాళ్ళు మన మంచి కోరేవారని పెద్దలు చెప్తారు. ఇది మిగిలిన గడపల కంటే కొంచెం పెద్దదిగా వుంటుంది. దీనిని ప్రతి రోజు శుభ్రంగా కడిగి, పసుపు పూసి కుంకుమ, వరిపిండితో బొట్లు పెట్టాలి. లక్ష్మీదేవిని అలంకరిస్తున్నామనే భావనతో చేయాలి. గుమ్మం ఎప్పుడూ పచ్చగా ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుందని, సింహద్వారంతోపాటు పెరటి ద్వారాన్ని కూడా అదే విధంగా పూజించాలి. సింహద్వారం ముందు వాకిలిలో కూడా ప్రతిరోజు కడిగి ముగ్గు వేసి, మధ్యలో పసుపు, కుంకుమ పెట్టాలి. గడపను తొక్కడం గానీ , దానిపై కూర్చోవడం గానీ , దానిపై తలపెట్టి గానీ అస్సలు పడుకో కూడదు. గడప ముందు చెప్పులు ఉంచకూడదు. ఇలాంటివేవి చేసినా లక్ష్మీదేవి ప్రవేశానికి ఆటంకం కలుగుతుందట.అంతేకాదు శుభకార్యానికి పిలువడానికి వచ్చినప్పుడు ఆ ఇల్లాలు ఇంట్లో లేకపోతే గడపకు బొట్టు పెట్టి గడపవద్ద శుభలేఖ ఉంచి వెళ్లడం ఆచారం. అంటే, ఆ ఇల్లాలికెంత ప్రాముఖ్యత ఉందో అంతే స్థాయిలో ఆ ఇంటి గడపకూ విలువ ఉంటుంది.
