5G Phones: కొత్త ఒక వింత. పాత ఒక రోత. అదే టెక్నాలజీ కాలానికి అన్వయించుకుంటే.. 5జి ఒక వింత.. 4 జి ఒక రోత. సాంకేతిక పరిజ్ఞానం మూస ధోరణిలో ఉండదు. రోజురోజుకూ మార్పులకు గురవుతూ ఉంటుంది. ఒకప్పుడు డబ్బా సెల్ ఫోన్లు ఉండేవి. ఈరోజు ప్రపంచాన్ని అరచేతిలో చూపించే ఫోన్లు వచ్చాయి. మళ్లీ ఇందులోనూ సాంకేతిక అద్భుతాలను మరింత దగ్గర చేసే ఫోన్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం మనదేశంలో ఐదవ తరం అంటే 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ప్రధాన నగరాలతో పాటు ఒక స్థాయి మెట్రో సిటీల్లో కూడా ఐదో తరం టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు టెలికాం కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మంచి వెనుక చెడు ఉన్నట్టు ఈ 5జీ వినియోగం పెరగడం మరో ఉత్పాతానికి కారణమవుతోంది.
5జి ఫోన్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు
టెలికాం కంపెనీలు 5జి సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ల కొనుగోలుదారులు 4 జి ఫోన్లతో పోలిస్తే కొద్దిగా ధర ఎక్కువైనప్పటికీ 5జి ఫోన్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొబైల్ ఫోన్ల సరఫరా వ్యవస్థలో 4జీ ఫోన్ల నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణంగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు కంపెనీలు, డీల్లర్లు, రిటైలర్లు అనే గొలుసు ఆధారంగా సాగుతాయి. మార్కెట్ అంచనాల ప్రకారం సాధారణంగా సెల్ఫోన్లు 9 నుంచి 10 వారాలకు సరిపడా నిల్వలు ఉంటాయి. ప్రస్తుతం ఈ నిల్వలు పై శాతానికి మించిపోయాయి. పాతబడిపోయిన 4 జీ మోడళ్ళను తక్కువ ధరకు విక్రయించి నిలువలను వదిలించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. వచ్చే పండుగల సీజన్లో 4జీ ఫోన్ల ధరలను కంపెనీలు తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 4జి ఫోన్ల ధరలను రెండు నుంచి మూడు వేల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పదివేల కంటే పైన ధర ఉన్న 4జీ మోడళ్ళను విడుదల చేసేందుకు కంపెనీలు ఇష్టపడటం లేదు. ఇక గతంతో పోలిస్తే సగటు 5జి ఫోన్ ధర తగ్గడం కూడా ఆ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నది.ఈ పరిణామంతో మార్కెట్లో 5జి ఫోన్ల విక్రయ వాటా 50 శాతానికి చేరుకుంది. సామ్ సంగ్, శామీ, వంటి కంపెనీలు ఈ ఏడాదిలో మరిన్ని 5జి ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నయ్. 5జి ఫోన్ల ధర 15 వేల కంటే దిగువకు చేరడం కూడా ఈ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నది. మొత్తం 5జి ఫోన్ల విక్రయాల్లో 15,000 వరకూ ఉన్న ఫోన్ల వాటా 50% వరకు ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 4 జి ఫోన్ కొనుగోలు చేయడం కన్నా, 5 జీ ఫోన్ ను కొనుగోలు చేయడం మంచిదనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు 5 జీ ఫోన్ ను కొనుగోలు చేస్తున్నారు. పది నుంచి 15 వేల ధరలో ఉన్న ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇక వినియోగదారులు భారీగా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో అమ్మకాలు మరింత పెంచుకునేందుకు ధరలు తగ్గిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. 2022లో పరిమాణపరంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు దాదాపు ఎనిమిది శాతం తగ్గాయి. 5జి ఫోన్ల విక్రయాలు 74% పెరిగాయి. 2023లో మొత్తం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గవచ్చని, అయితే స్మార్ట్ ఫోన్లు విక్రయాల్లో 5 జి ఫోన్ల వాటా 50 శాతానికి మించుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ ఫోన్ల మార్కెట్ వాటా తగ్గడంతో పాటు ప్రీమియం ఫోన్లో మార్కెట్ లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక భారత దేశంలో 5జి టెక్నాలజీ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు 2025 నాటికి కనీసం 80 లక్షల మంది నిపుణులను తయారు చేయాల్సి ఉంటుందని టీం లీజు సర్వే నివేదిక అభిప్రాయపడింది. దేశంలో ఉద్యోగాల సృష్టి, నైపుణ్య శిక్షణ పై 5జి ప్రభావానికి సంబంధించి 247 కంపెనీల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 3.1 కోట్ల మంది 5జి వినియోగదారులు ఉండగా.. వచ్చే ఐదు సంవత్సరాలలో అంటే 2028 నాటికి వీరి సంఖ్య 69 కోట్లకు పెరుగుతుందని ఒక అంచనా. దేశంలో మొబైల్ వినియోగదారుల కవరేజీ 2022లో 77 శాతం నుంచి 2028లో 94 శాతానికి చేరుకోనుంది.