Cooling Paint Technology: భూమిపై ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో కాంక్రీట్ భవనాలు అధికంగా ఉండటం వల్ల ‘ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ పెరిగి ఇళ్లలో ఉక్కపోత ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త తరహా కూలింగ్ పెయింట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఇంటిని చల్లగా ఉంచడమే కాకుండా గాలిలోని తేమ నుంచి నీటిని సేకరించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
ఆస్ట్రేలియాలోని University of Sydney పరిశోధక బృందం ఈ వినూత్న టెక్నాలజీని రూపొందించింది. చియారా నెటో, మింగ్ చియు నేతృత్వంలోని శాస్త్రవేత్తలు డ్యూపాయింట్ ఇన్నోవేషన్స్ కంపెనీతో కలిసి నానో ఇంజినీర్డ్ పాలిమర్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ పెయింట్‌లో ఉపయోగించిన PVDF-HFP టెక్నాలజీ కారణంగా ఇది సాధారణ పెయింట్లతో పోలిస్తే చాలా భిన్నంగా పనిచేస్తుంది. పెయింట్ ఉపరితలంలో సూక్ష్మ రంధ్రాలు ఉండటంతో సూర్యకాంతిని లోపలికి తీసుకోకుండా తిరిగి వెలుపలికి పంపిస్తుంది.
ఈ పెయింట్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సూర్యకాంతిలోని వేడిని 97 శాతం వరకు పరావర్తనం చేస్తుంది. దాంతో పైకప్పులు, గోడలు సాధారణ ఉపరితలాల కంటే సుమారు 6 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటాయి. సాధారణంగా ఇళ్లపై పడే వేడి భవనం మొత్తం ఉష్ణోగ్రతను పెంచుతుంది. కానీ ఈ కోటింగ్ కారణంగా వేడి నిల్వ కాకుండా వెంటనే బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల ఇంట్లో సహజంగానే చల్లదనం పెరుగుతుంది.
ఈ టెక్నాలజీలో మరో ఆసక్తికర అంశం నీటి ఉత్పత్తి. చల్లబడిన ఉపరితలాల దగ్గర గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఆ బిందువులను సేకరించడం ద్వారా నీటిని పొందవచ్చు. సిడ్నీ నానోసైన్స్ హబ్ నిర్వహించిన పరీక్షల్లో ఈ పెయింట్ సంవత్సరంలో 32 శాతం రోజులపాటు నీటిని సేకరించగలిగిందని తేలింది. ఒక్క చదరపు మీటర్ ఉపరితలం నుంచి రోజుకు సుమారు 390 మిల్లీలీటర్ల నీరు లభించినట్లు పరిశోధకులు వెల్లడించారు.
ఇది ముఖ్యంగా కరువు ప్రాంతాలకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఎండ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో నీటి కొరత ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అలాంటి చోట్ల ఇళ్ల పైకప్పుల నుంచే కొంతమేర తాగునీటిని సేకరించగలిగితే అది పెద్ద ఉపశమనం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, రిమోట్ ఏరియాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకో ముఖ్యమైన ప్రయోజనం విద్యుత్ ఆదా. ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గడంతో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గి కరెంట్ బిల్లులు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భవనాల్లో విద్యుత్ వినియోగంలో పెద్ద భాగం కూలింగ్‌కే ఖర్చవుతోంది. ఈ పెయింట్ ఆ సమస్యకు సహజ పరిష్కారంలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
