Christmas Day: ” నీ వలె పొరుగు వారిని ప్రేమించుము.” ఎంత గొప్ప మాట.. ఈ మాట అన్నది ఏసుక్రీస్తు.. నేడు ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోని క్రైస్తవులంతా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారు.. ప్రపంచంలో ఎక్కువగా ఉన్నది క్రైస్తవ దేశాలే కాబట్టి క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతాయి. దైవ ప్రార్థనలు మిన్నంటుతాయి. వాస్తవానికి
ఎక్కడో పశువుల పాకలో పుట్టిన ఏసుక్రీస్తు ఈ లోకానికి దారి చూపే దయామయుడు ఎలా అయ్యాడు? ప్రపంచానికి ప్రేమను పంచే కరుణామయుడు ఎలా అయ్యాడు? ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం.

పరిశుద్ధాత్మ ప్రభావంతో..
సరిగ్గా రెండు సహస్రాబ్దాలకు పూర్వం మరియ అనే యువతిని జోసెఫ్ అనే వ్యక్తికి ప్రదానం చేశారు. కానీ వాళ్ళిద్దరూ కాపురం చేయకుండానే పరిశుద్ధాత్మ ప్రభావంతో మరియ గర్భం దాల్చింది.. ఉన్నత వ్యక్తిత్వం, ఉత్తమ సంస్కారం గల జోసెఫ్ ఆమెను అవమానించలేదు.. కానీ రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి అనుకున్నాడు.. అతడు అలా అనుకోగానే ఆకాశవాణిగా దేవుడే ఆయనతో మాట్లాడాడు.. దైవ కుమారుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో ప్రవేశించాడని, త్వరలో మరియ ఒక కుమారుడికి జన్మనివ్వబోతోందని తెలియజేశాడు.. జోసెఫ్ దైవవాక్కును మన్నించాడు.. దీంతో భార్య మరియను విడిచిపెట్టలేదు..
పశువుల పాకలో పుట్టాడు
అప్పటి యూదయ రాష్ట్రంలో బెత్లెహేము పట్టణములో జనాభా లెక్కలు నమోదు చేస్తున్నారు.. జోసెఫ్ తన భార్యను తీసుకొని అక్కడికి వెళ్ళాడు..అక్కడ చూస్తేనేమో జనం వేలాదిగా ఉన్నారు.. నిండు చూలాలైన మరియకు అక్కడ నిలబడే చోటు కూడా కరువైంది.. అప్పటికే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.. గత్యంతరం లేక ఒక పశువుల పాకలోకి వెళ్లి తలదాచుకోగా అక్కడే బాల యేసు జన్మించాడు.. ఆయన జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక అరుదైన నక్షత్రం మెరిసింది.. ఆ నక్షత్రాన్ని హేరోదు అనే రాజు వివరం అడిగాడు.. పుట్టింది రాజాధిరాజని ఆ నక్షత్రం చెప్పడంతో హేరోదుకి భయం పట్టుకుంది. తనకు ప్రత్యర్థి పుట్టాడని కోపంతో, కుటిల మనసుతో తాను కూడా ఆ రాకుమారున్ని పూజిస్తానని చెప్పి వివరాలు ఏమిటో తెలియజేయమని పండితులను అడిగాడు. వాళ్లు రాజ ప్రసాదాన్ని విడిచి బయలుదేరగా, ఆ నక్షత్రం వారిపై నుంచి దారి చూపసాగింది. ఇశ్రాయేలు దేశానికి కాబోయే రాజు జన్మించాడు అంటూ అతన్ని చూసేందుకు ముగ్గురు జ్ఞానులు బయలుదేరారు. అయితే ఆ రాకుమారుడి రాజ్యం ఇహలోకానికి సంబంధించింది కాదని హేరోదుకి తెలియదు పాపం.. అయితే జ్ఞానులకు దారి చూపిస్తున్న అందాల నక్షత్రం ఓ పశువులపాక వద్ద నిలిచిపోయింది.. వారి లోపలికి వెళ్లి తొట్టిలో పడుకున్న రాజాధిరాజుకు ప్రణమిల్లారు. బంగారం, సాంబ్రాణి, బోళం(ఒక విధమైన సుగంధ ద్రవ్యం) తదితర కానుకలు సమర్పించారు.. బంగారం దైవత్వానికి సంకేతం. స్వర్ణాన్ని ఇవ్వడం ద్వారా ఆ బాలుడు దేవాధిదేవుడని చెప్పడం. శ్రమకు సంకేతం సాంబ్రాణి. అంటే మానవాళి కోసం ప్రభువు అనుభవించబోయే శ్రమను సూచించడం.. మనిషి మరణించాక పార్థివ దేహాన్ని యూదులు బోళంతో అభిషేకిస్తారు. ప్రభువు అలాగే అభిషేకిస్తాడని విశ్వసిస్తారు.. ఈ మూడు అంశాలు భవిష్యత్తులో ప్రభువుకు సంభవించబోయే సంఘటనలకు నిదర్శనం.. అంతేకాదు పాపకూపంలో పడి నశించిపోతున్న మానవాళికి జ్ఞానోదయం కలిగించి పరలోక ప్రాప్తిని అనుగ్రహించేందుకు దేవాధిదేవుడు తన పుత్రున్ని మనిషి రూపంలో అవతరింపజేశాడు.
అలా ఆరంభమైంది
మనిషికి దేవుడు ఇచ్చిన బహుమానమే యేసుక్రీస్తు. నేటికీ ఈ సంఘటన జరిగి 2022 సంవత్సరాలు అయింది.. క్రీస్తు జననంతో క్రీస్తు శకం ఆరంభమైంది.. అంతకుముందు కాలాన్ని క్రీస్తుకు పూర్వం అనేవారు.. బాల యేసు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో, దేవుని దయతో దినదిన ప్రవర్తమానంగా ఎదిగాడు. జ్ఞానాన్ని పంచుతూ భాసించాడు.. 12 సంవత్సరాలకే ఆ బాలుడు మానవాతీతమైన అపూర్వ జ్ఞాన తేజస్సుతో ఆలయంలో ప్రబోధలు వినిపించాడు.. ఆ ప్రబోధాలు వింటూ అందరూ అబ్బురపడ్డారు.. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించాలి. అప్పుడే మానవాళికి పరలోక ప్రాప్తి కలుగుతుంది.. ఇదే క్రీస్తు ప్రబోధామృతం.

పశ్చాత్తాపం చెందితే చాలు
ఎంతటి పాప కార్యాలు చేసినప్పటికీ వాటిని గ్రహించి పశ్చాత్తాపం చెందితే ఏసుక్రీస్తు క్షమిస్తాడు.. అదే క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు. చెడును విడిచి పెట్టినప్పుడు క్రీస్తు మనలోనే నివసిస్తాడు. మన హృదయ కవాటం వద్ద నిలబడి ప్రభువు తడుతూ ఉంటాడు. దానిని గుర్తించి ఆయనకు హృదయాన్ని అర్పించాలి.. అంతేగాని పూలు, పండ్లు, ఇతర కానుకలు ఆయనకు ఏమీ అక్కర్లేదు. ఇలా ఏసుక్రీస్తును మనసులో నిలుపుకోవడమే నిజమైన క్రిస్మస్.. ముందుగానే చెప్పినట్టు నీ వలె పొరుగు వారిని ప్రేమించినప్పుడే ఆ పండుగకు సార్ధకత. ఇదే ఆ దేవుడి పుట్టుక మహనీయత.