Male Fertility: ఆడవాళ్లలో అండం అయితే ఎలా విడుదలవుతుందో.. మగవాళ్లలో వీర్యం కూడా అలాగే ఉత్పత్తి అవుతుంది. వీర్యం పేరులోనే వీరత్వం ఉంది కాబట్టి దానినే మన పూర్వీకులు మగతనంగా అభివర్ణించారు. ఇక్కడ ఆడవాళ్ళను తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు. వారు లేకుంటే ఈ సృష్టి ఎక్కడ ఉందని? సరే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మగతనానికి ముచ్చెమటలు పడుతున్నాయి. “నీకేంట్రా మగాడివి అనే స్థాయి నుంచి.. బాబూ అంతా ఓకేనా” అనే స్థాయికి దిగజారింది.. ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన అధ్యయనం మేరకు కొన్ని సంవత్సరాలుగా మగవాళ్ళల్లో వీర్య పుష్టి లేదా స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గుతున్నట్టు అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చి పడేసింది. ఈ జాబితా లో భారత్ కూడా ఉన్నట్టు వివరించింది.. ఇక వీర్య పుష్టిలో క్షీణతను మానవ పునరుత్పాదక లోపంగానే కాకుండా, పురుషుల ఆరోగ్య కోణంలోనూ చూడాల్సి ఉంటుందని వివరిస్తోంది.

తగ్గితే ఏమవుతుంది?
వీర్యపుష్టి తగ్గితే దీర్ఘకాలిక వ్యాధులు చుట్టూ ముడతాయి. వృషణాల క్యాన్సర్, జీవితకాలంలో తగ్గుదల వంటి ప్రమాదాలు ఉంటాయి.. ఈ క్షీణతను ఆధునిక పర్యావరణ పరిస్థితులు, జీవన శైలులపరంగా ప్రపంచ సంక్షోభంగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.. మానవ జాతి మనుగడ పై దీని విస్తృత ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.. 53 దేశాల నుంచి సేకరించిన ఈ అధ్యయనం వివరాలు “హ్యూమన్ రిప్రొడక్షన్ అప్డేట్” అనే పుస్తకంలో మంగళవారం ప్రచురితమయ్యాయి. వీర్య వృద్ధి తగ్గటం వల్ల దంపతులు అనుకున్న సమయానికి పిల్లలు పుట్టడం లేదు. దీనివల్ల దాంపత్య జీవితంలో మనస్పర్ధలు మొదలవుతున్నాయి. అంతిమంగా విడాకులకు దారి తీస్తున్నాయి. వీర్య పుష్టి లేని పురుషుల్లో ఆత్మ న్యూనత భావం పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ యువకుడికి పెళ్లయింది. నాలుగు సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో దంపతులిద్దరూ వైద్యుడిని కలిశారు. అతగాడికి వీర్య వృద్ధి లేదని డాక్టర్ తేల్చిపడేశాడు.. దీంతో అమ్మాయి తరపు బంధువులు అతడిని గేలి చేయడం మొదలుపెట్టారు.. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.

50 శాతం తగ్గింది
భారత్ లాంటి దేశంలోనూ బలమైన, స్థిరమైన క్షీణత కనిపిస్తోందని ఇజ్రాయిల్ దేశంలోని హీబ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హగాయ్ లెవిన్ తెలిపారు. మొత్తానికి 46 ఏళ్లలో 50 శాతం వరకు వీర్య పుష్టి తగ్గిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఈ తగ్గుదల వేగం మరింత పెరిగిందని ఆయన వివరించారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, స్మార్ట్ వస్తువుల వాడకం పెరిగిపోవడం, లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం, జంక్ ఫుడ్ బాగా తినటం, జన్యుపరమైన కారణాలు వంటివి వీర్య క్షీణతకు కారణాలుగా నిలుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవనశైలి మార్పు ద్వారానే వీర్య వృద్ధిని పెంచుకోవచ్చని ఆయన హితవు పలికారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణం స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రపంచ జనాభా మంగళవారం నాటికి ఎనిమిది వందల కోట్లకు చేరిన నేపథ్యంలో హిబ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.