Car Care Tips: ఉదయం తొమ్మిదయితే చాలు సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు.. సాయంత్రం 6 గంటల దాకా అదే స్థాయిలో మండుతున్నాడు. ఏప్రిల్ లోనే 40 డిగ్రీలకు మించి వేడిమిని నమోదు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అడుగు బయట పెడితే ఇక అంతే సంగతులు. మరి అత్యవసరమైన పని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా కార్లలో ప్రయాణం చేసే వారి పరిస్థితి ఏమిటి? మండే ఎండలో కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కచ్చితంగా ఏసీ వాడుతారు. అప్పుడు ఇంజన్ మీద అధిక ఒత్తిడి పడుతుంది. అది కాస్త ఇంజన్లో వేడిమికి కారణమవుతుంది. అలా వేడి పెరిగిపోయి ఇంజన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. మిగతా కాలాల్లో కంటే ఎండాకాలంలో కారు ఇంజన్ విపరీతంగా వేడెక్కుతుంది. అందుకే పగటిపూట కారు బయటకు తీయాలంటే చాలామంది ఆలోచిస్తుంటారు.. ఎండాకాలంలో కారు ఇంజన్ వేడెక్కడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల కారు ఇంజన్ వేడెక్కకుండా చూసుకోవచ్చు.
వాటర్ పంప్ సరిగా పని చేయనప్పుడు
కారులో ఇంజన్ సరిగ్గా పనిచేయాలంటే వాటర్ పంప్ ఉండాల్సిందే. అది సరిగా పని చేయకపోతే ఇంజన్ ఊరికనే వేడెక్కుతుంది.. వాటర్ పంప్ అనేది ఇంజన్ వేడిని తగ్గిస్తుంది. ఆ వాటర్ పంప్ సరిగా పనిచేయకపోతే ఇంజన్ హఠాత్తుగా వేడెక్కుతుంది.
థర్మో మీటర్ స్టక్ కావడం..
థర్మో మీటర్ అనేది కారు రేడియేటర్ లో ఉండే చిన్న వాల్వ్ లాంటి పరికరం. ఇది ఫ్రీజ్ లేదా స్టక్ అయితే రేడియేటర్ ఇంజన్ ను నిలుపుదల చేస్తుంది. దీంతో ఇంజన్ వేడెక్కుతుంది.
యాంటీ ఫ్రీజ్ పనిచేయకుంటే..
చలికాలంలో ఇంజన్ గడ్డకట్టకుండా.. వేసవికాలంలో ఇంజన్ ను వేడెక్కకుండా ఉండడానికి యాంటీ ఫ్రీజ్ సహాయపడుతుంది. ఇది సరిగా పనిచేయకుంటే ఇంజన్ వేడెక్కే అవకాశం ఉంది. కాబట్టి యాంటీ ఫ్రీజ్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి..
రేడియేటర్లో ఇబ్బందులు
రేడియేటర్ అనేది కారు ఇంజన్లో కీలక భాగం. రేడియేటర్లోకి దుమ్ము ధూళి చేరితే ఇంజన్ వేడిని తగ్గించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంతేకాదు తరచూ కారు ఇంజన్ వేడికి ఆగిపోతుంది. అలాంటప్పుడు రేడియేటర్లో దుమ్ము ధూళిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
కూలెంట్ సిస్టం
కారు ఇంజన్లో వేడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అనివార్య కారణాలవల్ల ఇది సరిగా పనిచేయకపోతే కారు ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. ఎక్కువగా కూలెంట్ లీక్ అయితే ఇంజన్ వేడెక్కే ప్రమాదం ఉంటుంది. ఇంజన్లో ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఓవర్ హీట్ అవుతుంది. ఆయిల్ చాలా రోజుల నుంచి మార్చకుండా ఉంటే.. ఆయిల్ చిక్కగా మారి ఇంజన్ వేడెక్కడానికి కారణం అవుతుంది. పైన చెప్పిన చిట్కాలు మాత్రమే కాకుండా.. ఎక్కడికైనా ఎండలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కారును రెండు గంటలకు ఒకసారి నీడలో ఆపాలి. అంతేకాదు ఎండలో అస్సలు పార్క్ చేయకూడదు. దీనివల్ల కూడా ఇంజన్ ఊరికే వేడెక్కుతుంది.