
India Vs Australia 4th Test: నాగపూర్ లో గెలిచింది.. ఢిల్లీలో విజయం సాధించింది. కానీ ఇండోర్ లో బొక్క బోర్లా పడ్డది. ఇప్పుడు అహ్మదాబాద్ టెస్ట్ కీలకమైంది.. మరి ఇందులో రోహిత్ సేన గెలుస్తుందా? ఇండోర్ ఫలితాన్ని పునరావృతం చేస్తుందా? ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో అత్యంత కీలక మ్యాచ్ కోసం భారత జట్టు బరిలోకి దిగబోతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేనకు ఇది చావోరేవో టెస్టు కానుంది. ఎందుకంటే ఈ సిరీస్ ను నెగ్గేందుకు, అటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చోటు దక్కించుకునేందుకు కూడా ఆఖరిదైన నాలుగో టెస్టులో గెలుపు తప్పనిసరి. వరుసగా రెండు విజయాల ఊపులో, మూడో టెస్టును సైతం భారత్ అలవోకగా గెలుస్తుందని చాలామంది భావించారు. కానీ స్టీవ్ స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ఆ మ్యాచ్‌లో అదరగొట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఎక్కడా తగ్గకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చివరి టెస్టులోనూ పంజా విసరాలనుకుంటోంది ఆసీస్. ఇదే జరిగితే సిరీస్ 2-2తో సమమవుతుంది.
బ్యాటర్లు ఒళ్ళు వంచాల్సిందే
మూడో టెస్టులో భారత బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా నిరాశపరిచింది. ఓపెనర్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చి బరిలోకి దిగిన గిల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. అయితే అతడి స్థానానికి ప్రమాదమేమీ లేదు. కోహ్లీ కూడా సిరీస్‌లో ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పటివరకు అతడు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. శ్రేయాస్ దూకుడు ఫలితాన్నివ్వలేదు. కీపర్ భరత్ వికెట్ల వెనకాల రాణిస్తున్నా పరుగులు చేయలేకపోతున్నాడు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ అత్యధికంగా 207 పరుగులు చేస్తే.. తర్వాత స్థానంలో అక్షర్ పటేల్ (185) ఉండడం గమనార్హం. మిగతావారు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.
మైదానం పూర్తి విభిన్నం
అహ్మదాబాద్‌లో ఎర్ర మట్టి, నల్ల మట్టిలతో కూడిన రెండు పిచ్‌లున్నాయి. ఒకవేళ మ్యాచ్‌ను రెడ్ సాయిల్‌పై ఆడిస్తే అదనపు బ్యాటర్‌ను తీసుకోవచ్చు. ఈ సిరీస్‌లో భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగింది. టర్నింగ్ పిచ్‌ల కారణంగా పేసర్లు అంతగా ఉపయోగపడలేదు. అందుకే ఓ పేసర్‌ను తొలగించి సూర్యకుమార్‌ను ఆడించవచ్చు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్రకారం పేసర్ సిరాజ్ స్థానంలో షమి బరిలోకి దిగనున్నాడు.
జోష్‌లో ఆసీస్: స్వదేశానికి వెళ్లిన కెప్టెన్ కమిన్స్ స్థానంలో ఇండోర్ టెస్టుకు స్మిత్ పగ్గాలు చేపట్టగా.. ఆ మ్యాచ్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లోనూ రాణించింది. భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు స్మిత్ వ్యూహాలు చక్కగా పనిచేశాయి. తద్వారా సిరీస్ లో తొలి విజయంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆ జట్టుకు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌కు కూడా సారథి స్మిత్. అలాగే జట్టు విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకపోవచ్చు. కానీ స్వదేశానికి ఆవల ఆసీస్ వరుస టెస్టు విజయాలు సాధించడం అరుదు. ఈ ఫీట్‌ను ఆసీస్ చివరిసారిగా 2016, న్యూజిలాండ్‌లో సాధించింది. బ్యాటింగ్‌లో ఖవాజా, హెడ్, స్మిత్, లబుషేన్‌లతో టాపార్డర్ పటిష్ఠంగా ఉంది. స్పిన్ విభాగంలో లియోన్, మర్ఫీ, కునేమన్ ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని కట్టడి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఒకవేళ ఓడితే..
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ఆసీస్ తో తలపడాలంటే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాలి. అప్పుడే సమీకరణాలకు తావు లేకుండా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరుతుంది. ఒకవేళ ఈ టెస్టును భారత్ ఓడినా, డ్రా చేసుకున్నా.. అప్పుడు న్యూజిలాండ్-శ్రీలంక సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. కివీస్ తో జరిగే రెండు టెస్టులను క్లీన్‌స్వీప్ చేస్తే లంక ఫైనల్‌కు వెళుతుంది. అలా కాకుండా 1-0 లేక 1-1తో ఫలితం వచ్చినా భారత్‌కు అవకాశం ఉంటుంది.
తుది జట్ల అంచనా ఇలా
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, పుజార, కోహ్లీ, జడేజా, శ్రేయాస్, సూర్యకుమార్/ఉమేశ్, భరత్, అక్షర్, అశ్విన్, షమి.
ఆస్ట్రేలియా: ఖవాజా, హెడ్, లబుషేన్, స్మిత్ (కెప్టెన్), హ్యాండ్స్‌కోంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియోన్, మర్ఫీ, కునేమన్.
మైదానం పరిస్థితి
ఈ సిరీస్ లో మొదటిసారిగా బ్యాటర్లకు ఈ పిచ్ అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగేకొద్దీ స్పిన్నర్లు కీలకం కానున్నరాని క్యూరేటర్ చెప్తున్నారు. ఇక ఇక్కడ జరిగిన రెండు టెస్టుల్లో స్పిన్నర్లు 48 వికెట్లు తీయగా.. పేసర్లకు 11 మాత్రమే దక్కాయి.
