Oscar: సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమకాలీన సినిమా పరిస్థితులపై మాట్లాడుతుంటారు. విషయం ఏదైనా కుండబద్దలు కొడతారు. మంచి అనిపిస్తే పొగడడం, చెడు అనిపిస్తే తెగడడం చేస్తారు. తాజాగా ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా బడ్జెట్, కంటెంట్, సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తావన తెచ్చారు. ఆర్ ఆర్ ఆర్ టీం ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేశారు. వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కే కోట్లు అయ్యాయి. ఆస్కార్ బరిలో నిలిచేందుకు వారు ఖర్చు పెట్టిన డబ్బులు మాకిస్తే ఒక ఎనిమిది సినిమాలు చేసి ముఖాన కొడతాం.. అన్నారు.
అది వాళ్ళ ఇష్టం, ఎవరినీ తప్పుబట్టడానికి లేదని ఆయన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని సమర్ధించారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోట్ చేయాలి. ఆస్కార్ గెలవాలనే క్రమంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ భారీగా ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ ఈ కామెంట్స్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీని రాజమౌళి దాదాపు పది నెలలుగా అమెరికాలో ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ గురించి హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుకునేలా చేశారు. ప్రముఖ మీడియా సంస్థలలో ఆర్ ఆర్ ఆర్ కథనాలు ప్రచురించారు. అంతర్జాతీయ సినిమా వేదికలపై ప్రదర్శించారు. ఈ క్రమంలో సినిమాకు, దర్శకుడు రాజమౌళికి కొన్ని అవార్డులు, రివార్డులు దక్కాయి. ఇదంతా వెనకుండి కొన్ని సంస్థలు నడిపించాయి. అమెరికాలో దీని కోసం ప్రత్యేకంగా పీఆర్ సంస్థలు ఉన్నాయి. వాళ్లకు కోట్లు కుమ్మరించడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచం దృష్టిలో పడేలా చేయాల్సినవి చేశారు.
ఎంత గొప్ప చిత్రం అయినప్పటికీ ఆస్కార్ జ్యూరీ సభ్యుల దృష్టిలో పడాలంటే ప్రచారం చేయాలి. అమెరికన్ చిత్రాలకు ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ అవసరం ఉండదు. ఎందుకంటే హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. అమెరికన్ మీడియాలో హైలెట్ అయిన చిత్రాలకు ఆటోమేటిక్ గా ప్రచారం దక్కుతుంది. ఇతర దేశాల్లో, భాషల్లో తెరకెక్కిన చిత్రాలు ఆస్కార్ వరకూ వెళ్లాలంటే ఇలాంటి ప్రమోషన్స్ తప్పనిసరి. అయితే కోట్లు ఖర్చు పెట్టిన చిత్రాలకే ఆస్కార్ వస్తుందనేది నిజం కాదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ట్ చిత్రాలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఆస్కార్ గెలుచుకోవచ్చు.