Big TV AI Anchor Maya: యాంకర్ల మాయలో పడి.. “ఏఐ మాయ” ను తీసుకురాలేకపోయారు

ప్రస్తుతానికి బిగ్ టివి కే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిమేల్ యాంకర్ మాయ.. భవిష్యత్తు రోజుల్లో మిగతా చానల్స్ కు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సాంకేతికతను ఆడుకోవడం వల్ల అభివృద్ధి అనేది ఆగిపోతుంది.

Written By: Rocky, Updated On : July 13, 2023 4:30 pm

Big TV AI Anchor Maya

Follow us on

Big TV AI Anchor Maya: కొన్నిసార్లు నవ్వు రావచ్చు. కొన్నిసార్లు కోపం రావచ్చు. ఇంకా కొన్నిసార్లు చిరాకు కూడా రావచ్చు. ఈ మూడు హావాభావాల్లో ఏదైనా పలికినా.. వాటి నుంచి మాత్రం టీవీ9 బయటికి వెళ్ళదు. ఎందుకంటే గత 19 సంవత్సరాలుగా మనకు 24 గంటల పాటు వార్తలను అందిస్తోంది.. శ్రీదేవి చనిపోతే యాంకర్ బాత్ టబ్ లో కూర్చుని వార్త చేసినా.. హైదరాబాదులో వర్షం కురుస్తుంటే రుధిరం పడుతోందని చెప్పినా టీవీ9 కే చెల్లింది. పోస్కో, టాల్కం పౌడర్ పై వాటికి అదనం. రజనీకాంత్, దేవి, శిరీష, దీప్తి వాజ్పేయి.. ఒకరా ఇద్దరా.. మనల్ని ఆనందింప చేసేందుకు 24 గంటల పాటు కష్టపడుతున్న టీవీ9 వ్యాఖ్యాతలు వీరు.

అడ్డుకున్నారా?

వాస్తవానికి మొన్న బిగ్ టీవీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మాయ అనే ఒక లేడీ యాంకర్ ను ప్రవేశపెట్టారు. టీవీ9 లో రజనీకాంత్ కు మొన్నటిదాకా కుడి భుజంగా ఉన్న ఒక వ్యక్తి బిగ్ టీవీలోకి వెళ్లిపోయాడు. మాయను ప్రవేశపెట్టడం వెనుక అతడి దే కీ రోల్ అని చెబుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫిమేల్ యాంకర్ ను ఒడిశా ఛానల్, ఇంకో ఇంగ్లీష్ ఛానల్ ప్రవేశపెట్టాయి. వాస్తవానికి ఈ ఘనత టీవీ9 కే చెందాలి. అది ఎప్పటినుంచో ఈ విధానానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. కానీ టీవీ9 లో ఏళ్లకు ఏళ్లుగా పాతుకుపోయిన ఫిమేల్ యాంకర్లు ఈ ప్రయత్నానికి అడ్డుపడ్డారని తెలుస్తోంది. టీవీ9 లో పెద్ద తలకాయలు ఫిమేల్ యాంకర్లతో ఉన్న సత్సంబంధాల కారణంగా విరమించుకున్నట్టు తెలుస్తోంది.

ముప్పు తప్పదా?

ప్రస్తుతానికి బిగ్ టివి కే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిమేల్ యాంకర్ మాయ.. భవిష్యత్తు రోజుల్లో మిగతా చానల్స్ కు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సాంకేతికతను ఆడుకోవడం వల్ల అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఈరోజు టీవీ9 లాంటి ఛానల్ 24 గంటల పాటు వార్తలు అందిస్తోంది అంటే దానికి కారణం దాని వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానమే. ఇప్పుడు తెరపైకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సాంకేతిక పరిజ్ఞానానికి అప్డేట్ రూపం. దీన్ని అమల్లోకి తీస్తే ఫిమేల్ యాంకర్ల పరిస్థితి అగమ్య గోచరమవుతుందని ప్రస్తుతానికైతే టీవీ9 నిలుపుదల చేయవచ్చు. కానీ భవిష్యత్తు రోజుల్లో దీనినే వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మార్పు నిత్యం. మార్పు సత్యం. మార్పు శాశ్వతం. అన్నింటికీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కనుక సక్రమంగా వాడుకుంటే తెలుగు ప్రేక్షకులకు రుధిరం బాధలు తప్పుతాయి. అడ్డగోలు టీవీ డిబేట్ల తలనొప్పులు తగ్గుతాయి. ప్రశాంతంగా వార్తలు చూడొచ్చు. కాకపోతే మాయ మన భాషను స్పష్టంగా పలికితే ఇంకా ఆనందంగా వీక్షించవచ్చు.