Best Women Jobs: ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అంటే మగవాడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉండాలి. అది ఉద్యోగం కావచ్చు.. లేదా వ్యాపారం కావచ్చు.. లేదా వ్యవసాయం కావచ్చు.. అయితే ప్రస్తుత కాలంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. ఇదే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొందరు పెద్ద చదువులు చదువుకొని.. ఉద్యోగం చేయాలన్న ఉత్సాహం ఆడవారిలో ఉంటుంది. దీంతో పెళ్లయిన తర్వాత కూడా వారు ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయడం సబబే. కానీ వీరి ఉద్యోగాలు కుటుంబ జీవితంపై ప్రభావం పడకుండా ఉండాలి. అది ఎలాగంటే?
హైదరాబాద్ లాంటి నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు. అయితే కొందరు అవసరం కోసం ఉద్యోగాలు చేస్తే.. మరికొందరు స్వాతంత్రం కోసం ఉద్యోగాలు చేయాలని ఉత్సాహం చూపిస్తారు. అయితే ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో పట్టించుకోకపోవడంతో వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ కార్యాలయాలకు వెళ్తే సాయంత్రం వచ్చిన తర్వాత.. అలసిపోతారు. అప్పుడు పిల్లలతో మాట్లాడే ఓపిక ఉండదు. అంతేకాకుండా వారికి ఉన్న సమస్యలను తీర్చలేక పోతారు. ఈ క్రమంలో పిల్లలు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరిగి ఆ తర్వాత తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయొద్దని ఎవరు చెప్పరు. అయితే ఇద్దరిలో ఒకరు సీరియస్ గా వర్క్ చేస్తే.. మరొకరు ఒత్తిడి లేకుండా ఉండే ఉద్యోగాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆడవారు ఒత్తిడి లేని ఉద్యోగాలను చేయాలి. ఎందుకంటే ఆడవారికి ఇంట్లోనే అనేక పనులు ఉంటాయి. వీటితోనే సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కార్యాలయాల్లో అనేక బాధలు పడిన తర్వాత.. ఇంట్లోకి వచ్చి మళ్లీ కొత్త బాధలు పడాల్సి వస్తుంది. దీంతో తీవ్ర అలసటకు గురై అనారోగ్యానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకు తండ్రితో కంటే తల్లితో ఎక్కువగా అనుబంధం ఉంటుంది. అందువల్ల పిల్లలతో గడిపే సమయాన్ని ఆడవారు ఎక్కువగా కేటాయించుకోవాలి.
అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఆశతో చాలామంది ఆడవాళ్లు ఈ రంగంలో దూసుకెళ్తున్నారు. అయితే అవకాశం ఉన్నప్పుడు వదులుకోవాలని ఎవరూ చెప్పరు. ఇలాంటి అప్పుడు మగవారు తక్కువ ఒత్తిడి ఉద్యోగాన్ని చేస్తూ కుటుంబంపై దృష్టి పెట్టాలి. ఎవరో ఒకరు కుటుంబం పై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పిల్లలనుంచి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చాలామంది డబ్బు సంపాదించాలన్న కోరికతో కుటుంబం పై దృష్టి పెట్టకుండా ఉద్యోగాలు చేస్తూ కుటుంబంతో జీవించే సమయాన్ని కోల్పోతున్నారు. ఇది తాత్కాలికంగా ఎలాంటి ప్రభావం చూపకపోయినా రానున్న రోజుల్లో అనేక సమస్యలు దారితీస్తుంది. అందువల్ల భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకరు ఒత్తిడి లేని ఉద్యోగాన్ని ఎంచుకోవాలి. అప్పుడే కుటుంబ జీవితం బాగుంటుంది.