BCCI- Selection Committee: టీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ వల్ల ఇండియా చేతులు కాలాయి. ఆకులు పట్టుకుంటే లాభం లేదు.. బర్నాల్ రాసుకునే సమయం వచ్చినట్టుంది. అందుకే సెమీస్ ఓటమి గుణపాఠాన్ని మంచిగానే ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తున్నది. వెంటనే ప్రక్షాళనకు నడుం బిగించింది. ఈ సీరిస్ లో భారత్ కొంప ముంచిన పేలవ బౌలింగ్ పై ప్రధానంగా దృష్టి సారించింది. చేతన్( నార్త్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబాసిస్ మహంతి (ఈస్ట్ జోన్) పై వేటు వేసింది. కొత్త వారికోసం దరఖాస్తులను ఈనెల 26 వరకు ఆహ్వానించింది.

పరువు పోయింది
టీ 20 మెన్స్ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ ల్లో భారత్ ఒక్క ప్రోటిస్ తో తప్ప అన్ని మ్యాచ్ ల్లో గెలిచింది. ఈ మ్యాచ్ ల్లో బౌలర్లు చూపిన ప్రతిభ చాలా తక్కువ. ఇక సెమీస్ లో అయితే ఇంగ్లీష్ ఆటగాళ్లు ఓ ఆట ఆడుకున్నారు. భారత్ బౌలింగ్ ను ఓ ఆట ఆడుకున్నారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక పోవడం భారత బౌలర్ల దయనీయ స్థితిని చాటి చెప్పింది. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ సమాఖ్యకు తత్వం బోధపడింది. వెంటనే న్యూజిలాండ్, బంగ్లా పర్యటనకు కొత్త జట్టును ఎంపిక చేసింది.
వీరి పై కూడా వేటు
టి20 మెన్స్ వరల్డ్ కప్ ఆడిన దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షఫీ లు అనుకున్నంత మేర రాణించలేకపోవడంతో వారికి పొట్టి క్రికెట్ మ్యాచ్ ల్లో ఆడే అవకాశం భారత క్రికెట్ సమాఖ్య ఇవ్వకపోవచ్చు. వచ్చే ఏడాది ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ తమ ఫోకస్ 50 ఓవర్ల మ్యాచ్ మీద పెట్టే అవకాశం ఉంది. ఇక వీరిని కూడా పొట్టి క్రికెట్ మ్యాచ్ లకు దూరంగా ఉంచే అవకాశం కనిపిస్తోంది.. ఇక కేఎల్ రాహుల్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రిషబ్ పంత్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతున్న నేపథ్యంలో వారిని కూడా పొట్టి క్రికెట్ కు దూరంగా ఉంచాలని భారత క్రికెట్ సమాఖ్య భావిస్తోంది.

కీలక ఆటగాళ్ళను ఎందుకు పక్కన పెట్టినట్టు
భారత క్రికెట్ సమాఖ్య దిద్దుబాటు బాగానే ఉంది. కానీ సెమిస్ ఓటమి తర్వాత పాఠాలు నేర్చుకుంది.. కానీ అంతకుముందే ఈ పని చేస్తే భారత జట్టుకు కప్ వచ్చేది. 15 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేది. ఉన్న వనరులు కూడా భారత క్రికెట్ సమాఖ్య ఉపయోగించుకోలేదు. ఆస్ట్రేలియా పిచ్ ల పై లెగ్ స్పిన్నర్ల కు అవకాశాలు బాగా ఉంటాయి.. కానీ భారత్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాట్స్మెన్ లో కూడా సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాత్రమే రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఒక్క మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేదు. సిరాజుద్దీన్ లాంటి బౌలర్లు మెరుపు వేగంతో బంతులు వేస్తున్నప్పటికీ.. టి20 వరల్డ్ కప్ సిరీస్ ఎంపిక చేయకపోవడం భారత సెలక్టర్ల బేలతనానికి నిదర్శనం. ఇండియా టీంను 36 టీం గా సామాజిక మాధ్యమాల్లో ఇతర దేశాల అభిమానులు ట్రోల్ చేస్తున్నారంటే దానికి సెలక్ట ర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 36 వయసు ఉన్న ఆటగాళ్లు ఆడలేరా అంటే ఆడుతారు. కానీ నొప్పిని తగ్గించే మందుకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.