India vs Bangladesh 2nd Test: పరిగెత్తే వాడి కాళ్ళల్లో కట్టెలు పెడితే ఎలా ఉంటుంది? అచ్చం కులదీప్ యాదవ్ పరిస్థితిలా ఉంటుంది. పై వ్యాక్యంలో పరిగెత్తేవాడు కులదీప్ యాదవ్ అయితే.. కట్టెలు పెట్టేది భారత్ క్రికెట్ క్రీడా సమాఖ్య. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కోల్పోయాక.. భారత్ ఎలాగైనా టెస్ట్ సిరీస్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మొదటి టెస్ట్ భారత్ గెలిచింది. భారత్ గెలిచింది అనే దానికంటే కులదీప్ యాదవ్ గెలిపించాడు అనడం సబబు. నిర్జీవమైన పిచ్ పై పది వికెట్లు తీశాడు అంటే అతడి బౌలింగ్ అలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి అనిల్ కుంబ్లే ను లభించాడు. గూగ్లీ, దూస్రా, వికెట్ టు వికెట్.. ఇలా అతడు వేయని బంతులంటూ లేవు. వేసే ప్రతి బంతిలో వైవిధ్యాన్ని చూపడంతో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. ఫలితం భారత్ ఘన విజయం సాధించింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో జట్టు విజయానికి కారకుడైన అతడిని రెండో టెస్టులో ఆడించకపోవడం టీమిండియా జట్టు కూర్పులో ప్రధాన లోపం.

సోయి ఉందా?
విదేశాల్లో భారత్ ఆడుతున్నప్పుడు జట్టు కూర్పు మెరుగ్గా ఉండాలి. అంతటి ఆస్ట్రేలియా కూడా శ్రీలంక పర్యటనకు బలమైన జట్టును పంపించింది. కానీ ఇదే భారత్ విషయంలో మాత్రం పూర్తి విరుద్ధం. అసలు జట్టును ఎవరు ఎంపిక చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? దీనికి ప్రాతిపదిక ఏమిటో? ఎప్పటికీ అంతు పట్టకుండా ఉంది. ఆసియా కప్, టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్, న్యూజిలాండ్ పర్యటన తర్వాత జట్టు కూర్పు మారింది అనుకుంటే.. ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడినే తలపిస్తోంది. అసలు ఒక టెస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన బౌలర్ ను తదుపరి మ్యాచ్ కు దూరంగా ఉంచడం కేవలం టీం ఇండియాలోనే సాధ్యమవుతుంది కావచ్చు.

కులదీప్ యాదవ్ పనికిరాడా?
ఈ మాట అంటున్నది సాక్షాత్తు భారత క్రికెట్ క్రీడా సమాఖ్య.. మొదటి టెస్ట్ మ్యాచ్లో అతడు పది వికెట్లు తీశాడు. ప్రాక్టీస్ సెషన్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఇవేవీ గుర్తించని మేనేజ్ మెంట్ రెండో టెస్టుకు అతడిని దూరంగా ఉంచింది. పైగా పిచ్ టర్నింగ్ ట్రాక్ కావడంతో తొలిరోజు నుంచే స్పిన్నర్ల హవా సాగే అవకాశం ఉంది.. పైగా తొలి టెస్టులో స్పిన్నర్ అశ్విన్ తేలిపోయాడు.. బ్యాటింగ్లో మాత్రం ఆఫ్ సెంచరీ తో రాణించాడు. ఆ లెక్కన కులదీప్ యాదవ్ కూడా మెరుగైన పరుగులు చేశాడు. అతడిని కాదని ఉనద్కత్ కు ఆకాశం ఇచ్చారు. వర్ధమాన క్రీడాకారులకు అవకాశాలు ఇవ్వాలి. దాన్ని ఎవరూ కాదనరు. కానీ ఫామ్ లో ఉన్న కులదీప్ యాదవ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం టీం ఇండియా మేనేజ్ మెంట్ ఆలోచనా లేమి కి నిదర్శనం. పోనీ కులదీప్ యాదవ్ కంటే ఉమేష్ యాదవ్ బాగా రాణిస్తున్నాడా అంటే అదీ లేదు. మొన్నటి టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ లో ఓటమి తర్వాత కోచ్ లను తొలగించిన బీసీసీఐ.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతామని చెప్పింది.. బహుశా ఆ విప్లవాత్మక మార్పులు అంటే… బాగా ఆడే ఆటగాడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం అన్నమాట!