Traditional Foods: కాలే కడుపుకు మండే గంజి అంటారు. ప్రతిరోజు గంజి తాగితే నాలుక చచ్చుబడిపోతుంది. అందుకే రోజుకో రుచితో నాలుకను సంతృప్తి పరచాలి. అప్పుడే జిహ్వ కు రుచి.. దేహానికి శుచి లభిస్తాయి. పొద్దంతా కష్టపడేది జానెడు పొట్ట కోసమే.. ఆ పొట్టలో ఇంత ఆహారం వేస్తే దేహానికి శక్తి లభిస్తుంది. ఆ శక్తి ద్వారా పనిచేయవచ్చు. ఆకలికి మించి ఆహారాన్ని సమకూర్చుకోవచ్చు.
పని సంస్కృతి ఎలాగైతే పుట్టిందో.. వివిధ ప్రాంతాలలో వెరైటీ ఆహార పదార్థాలు కూడా అలాగే పుట్టాయి. తెలుగు రాష్ట్రాలలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో తీరైన వంటకాలు లభిస్తుంటాయి. తెలంగాణలో మాంసాహారం, బిర్యాని, తపాల చెక్క, గుగ్గిళ్ళు, సకినాలు, అనేక రకాల పిండి వంటలు విశేషమైన ప్రాచుర్యం పొందాయి.. పండుగల సమయంలో తెలంగాణలో ప్రతి ఇంట్లో పిండి వంటలు ఉంటాయి.. అవి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి.
ఇక ఆంధ్రాలో అయితే విభిన్నమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి.. అక్కడ రకరకాల ఆహార పదార్థాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో లభించే ఆహార పదార్థాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఉదాహరణకు గోదావరి కి దగ్గర్లో ఉన్న రావులపాలెం ప్రాంతాన్ని తీసుకుంటే.. అక్కడ లభించే టిఫిన్ల నుంచి మొదలు పెడితే వంటకాల వరకు ప్రతిదీ ప్రత్యేకమే. రావులపాలెంలో తేనె పాకం.. దిబ్బ రొట్టె అదిరిపోయే కాంబినేషన్. కొబ్బరి డెక్కల వేడిలో దిబ్బ రొట్టె తయారు చేస్తారు. నంజుకు తినడానికి తేనె పానకం ఇస్తారు. అందులో దిబ్బ చట్నీ.. పల్లి చట్నీ అదనం.. తేనె పానకంలో ఒకసారి.. పల్లి చట్నీ, దిబ్బ చట్నీలో మరొకసారి రోటీని ముంచుకుని తింటుంటే నా సామి రంగ నాలుక నాట్యం చేస్తూ ఉంటుంది.
ఇది మాత్రమే కాదు పెసర పునుగులు.. పెసరట్టు.. ఆవిరి కుడుములు.. పొట్టికలు.. విటమిన్ ఇడ్లీ.. మినప వడలు.. మినప దోస.. రవ్వ దోశ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మిగతా ప్రాంతాలలో కూడా ఇవి లభిస్తాయేమోగానీ.. దిబ్బ రొట్టె.. ఆవిరి కుడుము.. విటమిన్ ఇడ్లీ.. పెసర పునుగులు మాత్రం ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇవన్నీ తిన్న తర్వాత.. వేడివేడి కాఫీ తాగితే వచ్చే మజానే వేరు..
గుంటూరు, వరంగల్ లో మిర్చి పండుతుంది.. ఇక్కడ వండర్ హాట్ రకం అద్భుతంగా ఉంటుంది. మదనపల్లిలో టమాట విస్తారంగా సాగవుతుంది.. పలాసలో జీడిపప్పు నాణ్యంగా ఉంటుంది.. నూజివీడులో మామిడి క్వాలిటీ ఒక రేంజ్ లో ఉంటుంది.. ఇలా నేలకు తగ్గట్టుగా పంటలు పండినట్టే.. ప్రాంతాలకు తగ్గట్టుగా వంటకాలు ఉంటాయి. అవి ఆ ప్రాంతాన్ని పరిపుష్టం చేయడం మాత్రమే కాదు.. అక్కడి సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తాయి.