New House: మనం కొన్ని సమయాల్లో కట్టిన ఇల్లు కొంటాం. సమయం ఉంటే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాం. కానీ మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు వాస్తు పద్ధతులు చూసుకోవాల్సిందే. ఇంటికి అన్ని హంగులు ఉంటేనే కొనుగోలు చేయాలి. లేదంటే వాస్తు దోషాలు ఉంటే మనం తరువాత తిప్పలు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇల్లు కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే తరువాత దాని ఫలితాలు మనకు ప్రతికూలంగా మారవు. పక్కా వాస్తు ఉంటేనే ఇల్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం మంచిది.
మనం కొనాలనుకుంటున్న ఇల్లు మూలలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పడక గది నైరుతిలోనే ఉండేలా చూసుకోవాలి. ముఖద్వారం ఉత్తరం లేదా తూర్పు ఉంటేనే మంచిది. మెట్లు ఈశాన్యంలో ఉండకూడదు. సరైన దిశలో ఉంటేనే కొనాలి. లేదంటే మానుకోవాలి. వంట గది ఈశాన్యంలో ఉండకూడదు. ఆగ్నేయంలో ఉంటేనే వాస్తు ప్రకారం ఉన్నట్లు. మరుగుదొడ్డి వాయువ్య దిశలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
మనం ఇల్లు కొన్న తరువాత కూడా మార్పు చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇవి సులభంగా మార్చుకోవచ్చు. ఫర్నిచర్ సరైన దిశలో లేకుంటే దాన్ని మార్చుకోవచ్చు. ఫ్లోరింగ్ కూడా సరిగా లేకపోతే మళ్లీ చేసుకోవచ్చు. వంట గది దిశ సవ్యంగా లేకపోతే మనకు ఇష్టమైన విధంగా చేసుకోవచ్చు. టాయిలెట్ బేసిన్ల దిశలు కూడా సరిగా లేకపోతే మళ్లీ సరైన దిశలోకి తెచ్చుకోవచ్చు. పూజా గది కూడా వాస్తు ప్రకారం లేకపోతే మార్చుకోవచ్చు.
ఇంటికి వేసుకునే కలర్లు కూడా మార్చుకోవచ్చు. కానీ కొన్నింటిని మార్చలేం. చిన్న చిన్న మార్పులు ఉంటే సరే కానీ మేజర్ సమస్య ఉంటే మాత్రం దాన్ని సరిచేయడం మన వల్ల కాదు. అందుకే ఇల్లు కొనేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పక్కా వాస్తు ప్రకారం ఉంటే ఎలాంటి సమస్యలు రావు. సంసారం సవ్యంగా సాగుతుంది. బాధలు లేని జీవితం మన సొంతం అవుతుంది. ఇలా వాస్తు దోషాలు లేకుండా చూసుకుని ఇల్లు కొనుక్కోవడం మంచిది.